ఉత్తర ప్రదేశ్‌లోని సిద్ధార్థ్ నగర్ జిల్లాలో ఓ విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా అదే ప్రాంతానికి చెందిన గోపాల్‌కు 30 ఏళ్ల క్రితమే పెళ్లి జరిగింది. భార్యతో పాటు నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. వారిలో ముగ్గురు అమ్మాయిలు కాగా, మరొకరు అబ్బాయి. అయితే ఇతడు కూలీ పనికి వెళ్తుండగా.. భార్య వడాపావ్ అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఉన్నంతలోనే వీరంతా హాయిగా ఉంటుండగా.. గోపాల్‌కు అదే గ్రామానికి చెందిన మరో మహిళతో పరిచయం ఏర్పడింది. ఆమెనే గీత. గీతకు పెళ్లి జరిగి 40 సంవత్సరాలు అవుతుండగా మొత్తం ఐదుగురు పిల్లలు ఉన్నారు. అయితే వారిలో నలుగురు ఆడ పిల్లలు కాగా, ఒక కుమారుడు.
గీత భర్తతో పాటు గోపాల్ కూడా ఒకే దగ్గర కూలీ పని చేస్తుంటారు. అయితే వీరంతా ఒకే ప్రాంతంలో ఉండగా.. రెండు కుటుంబాలకు స్నేహం ఉంది. ఈక్రమంలోనే గోపాల్.. గీతతో స్నేహాన్ని పెంచుకున్నాడు. అది కాస్తా ప్రేమగా మారి ఆపై వివాహేతర సంబంధానికి దారి తీసింది. చాలా కాలంగా వీరిద్దరి మధ్య బంధం కొనసాగుతుంది. అయితే ఈ విషయం రెండు కుటుంబాల్లోని ఎవరికీ తెలియదు. దీన్నే అదునుగా భావించిన గీత, గోపాల్.. కుటుంబాలను వదిలేసి ఎటైనా వెళ్లిపోయి హాయిగా జీవించాలనుకున్నారు. అందుకోసం ఓ ప్లాన్ కూడా వేసుకుని ఇంటి నుంచి పరారయ్యారు. అయితే గీత వెళ్తూ వెళ్తూ ఇంట్లోని నగలు, రూ.90 వేల నగదును తీసుకెళ్లింది. గోపాల్ కూడా భార్య నగలు, ఇంట్లో ఉన్న డబ్బు తీసుకుని వెళ్లిపోయాడు.
ఉన్నట్టుండి గీత కనిపించకపోయేసరికి.. ఆమె భర్త పుట్టింటికి వెళ్లిందేమో అనుకున్నాడు. వారికి ఫోన్ చేయగా గీత రాలేదని చెప్పారు. ఈక్రమంలోనే వెతుకులాట ప్రారంభించారు. మరోవైపు గోపాల్ భార్య కూడా భర్త కనిపించక పోయేసరికి వెతకడం ప్రారంభించింది. స్నేహితులు, బంధువులు అందరికీ ఫోన్ చేసింది. అయితే వారు ఇంటి నుంచి వెళ్లిపోయిన రెండ్రోజుల తర్వాత గోపాల్.. ఫేస్‌బుక్ వేదికగా గీతను పెళ్లి చేసుకున్న ఫొటోలు, వీడియోలను షేర్ చేశాడు. అది చూసిన రెండు కుటుంబాలు షాక్ అయ్యాయి. గ్రామస్థులు కూడా నివ్వెర పోయారు. 9 మంది పిల్లలను వదిలేసి వారలా పారిపోవడం దారుణం అంటూనే ముక్కున వేలేసుకున్నారు.
తమని మోసం చేసిన వెళ్లిపోయిన గీత, గోపాల్‌లపై రెండు కుటుంబాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ముఖ్యంగా గీత భర్త.. తనకు భార్య అవసరం లేదని, కాకపోతే ఆమె తీసుకెళ్లిన డబ్బు, నగలు ఇప్పించాలని కోరారు. పిల్లలను కూడా తానే చూసుకుంటానని వివరించారు. మరోవైపు గోపాల్ భార్య.. వడాపావ్ అమ్ముతూ అంత మంది పిల్లలను పోషించలేనని.. తన భర్తే పిల్లల బాధ్యత తీసుకోవాలని చెబుతోంది. అంతేకాకుండా తన దృష్టిలో భర్త చనిపోయాడని భావిస్తున్నట్లు వివరించింది. ప్రస్తుతం పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
![]() |
![]() |