ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాణా విచారణ... దాడికి ముందు దుబాయ్‌లో ఓ వ్యక్తిని కలిసినట్టు వెల్లడి

national |  Suryaa Desk  | Published : Sat, Apr 12, 2025, 08:10 PM

అమెరికా నుంచి తీసుకొచ్చిన 26/11 ముంబయి ఉగ్రదాడి నిందితుల్లో ఒకరైన తహవూర్ రాణాను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారిస్తోంది. అయితే, ముంబయి మారణహోమానికి ముందు దుబాయ్‌లో రాణా కలిసినట్లు ఆరోపణలు ఉన్న ఒక రహస్య వ్యక్తిపై ఎన్ఐఏ దృష్టి సారించింది. ఈ కేసులో ఆ వ్యక్తే కీలకంగా మారినట్టు తెలుస్తోంది. ఎన్ఐఏ వర్గాల ప్రకారం.. ఈ వ్యక్తికి దాడి గురించి ముందే సమాచారం ఉంది. ఆ వ్యక్తి 2006లో డేవిడ్‌ కోల్‌మాన్ హెడ్లీని ముంబయిలో రిసీవ్‌ చేసుకున్నట్లు అధికారిక వర్గాల సమాచారం. అతడ్ని తీసుకొచ్చి.. రాణా ఎదుట కూర్చోబెట్టి ముఖాముఖీగా విచారించనున్నట్లు సదరు వర్గాలు తెలిపారు. కుట్రలో రాణా పాత్రపై అతడి వాంగ్మూలం కీలకమని అధికారులు భావిస్తున్నారట..! దీంతో ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? అనేది చర్చనీయాంశమవుతోంది.


ముంబయి ఉగ్రదాడికి ముందు రాణా దుబాయ్‌లో అతడ్ని కలిశాడని, అమెరికా దర్యాప్తు సంస్థలు భారతీయ అధికారులతో పంచుకున్న సమాచారం ప్రకారం ఈ వ్యక్తికి జరగబోయే దాడి గురించి తెలుసు.. ఈ వ్యక్తి గుర్తింపు, అతడి పాత్రను దర్యాప్తు చేస్తున్నట్టు ఎన్ఐఏ ధ్రువీకరించింది.


ఎన్ఐఏ వర్గాల ప్రకారం.. దావూద్ గిలానీ అలియాస్ హెడ్లీ.. 2008లో రాణాను భారత్‌కు వెళ్లొద్దని స్పష్టంగా హెచ్చరించాడు. తక్షణ ఉగ్రవాద కార్యకలాపాల గురించి సూచనలు చేశాడు. రహస్య వ్యక్తిని రాణా దుబాయ్‌లో కలవడానికి హెడ్లీ ఏర్పాటు చేశాడని, దాడి తక్షణమే జరుగుతుందని అతడు ధ్రువీకరించాడని పేర్కొన్నాయి. ఆ వ్యక్తికి పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ సీనియర్ అధికారి లేదా లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థ నాయకుడితో సంబంధం ఉందా? అనేది అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అత్యంత ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. ఈ వ్యక్తి గుర్తింపును దర్యాప్తు సంస్థలోని ఉన్నతవర్గాల్లో రహస్యంగా ఉంచారు. అమెరికా అధికారుల విచారణలో రాణా అతడి గురించి ప్రస్తావించి ఉండొచ్చని ఏజెన్సీలు విశ్వసిస్తున్నాయి.


లీజుపై సందేహాలు


ఈ కేసులో మరో కోణం ఏంటంటే.. రాణా, హెడ్లీ నవంబర్ 2008లో తీసుకున్న నిర్ణయం. ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీ ముసుగులో రాణా నిర్వహిస్తోన్న ఆఫీసు భవనం లీజు పునరుద్ధరించలేదు. ఈ కార్యాలయాన్ని హెడ్లీ నగరంలోని కీలక హోటళ్లు, బహిరంగ ప్రదేశాలతో సహా ఉగ్రవాదుల టార్గెట్‌లకు గూఢచర్యం కోసం ఉపయోగించినట్టు సమాచారం.


ఎన్ఐఏ గత దర్యాప్తు ప్రకారం.. ఆగస్టు 2005లో రాణా సంస్థ కోసం పని చేసే ముసుగులో రెక్కీ కోసం లష్కరే తొయిబా (LeT) తనను భారత్‌కు పంపాలని యోచిస్తున్నట్లు అతడికి హెడ్లీ తెలియజేశాడు. గూఢచర్య కార్యకలాపాలు తన ఇమ్మిగ్రేషన్ వ్యాపారం అనుకూలంగా ఉంటుందని భావించిన రాణా.. హెడ్లీ కన్సల్టెంట్‌గా నటిస్తాడని సూచించాడు. హెడ్లీ రూపురేఖలు,, అమెరికా పాస్‌పోర్ట్ భారత్‌లో స్వేచ్ఛగా తిరగడానికి, ముంబయి ప్రముఖ ప్రదేశాల్లో రెక్కీ.. వాటిని వీడియో తీసి డేటాను పాకిస్థాన్‌లోని హ్యాండ్లర్లకు పంపడానికి తోడ్పడ్డాయి..


దేశంలోని పలు నగరాల్లో దాడులకు కుట్ర?


ఎన్ఐఏ వర్గాల ప్రకారం.. ముంబయిలో వ్యూహాలు.. దేశంలోని ఇతర నగరాల్లో కూడా ఇలాంటి దాడులకు ఒక విస్తృత ప్రణాళికలో భాగం కావచ్చని భావిస్తున్నారు. విచారణలో భాగంగా రాణా ప్రయాణ రికార్డులను నిశితంగా పరిశీలిస్తున్నారు. అలాగే, 2008 నవంబర్ 13, 21 మధ్య, రాణా తన భార్య సమ్రాజ్ రాణా అక్తర్‌తో కలిసి ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్, ఆగ్రా, ఢిల్లీ, కొచ్చి, అహ్మదాబాద్, ముంబయితో సహా అనేక నగరాలను సందర్శించాడు. ఈ ప్రయాణాలు దాడులు చేయడానికి గూఢచర్య మిషన్‌లో భాగంగా ఉన్నాయా? అని దర్యాప్తు చేస్తున్నారు.


నెట్‌వర్క్


ముంబయి దాడి విస్తృత కుట్రలో భాగమని భావించిన ఎన్ఏఐ.. లష్కరే తొయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్; దాని ఆపరేషనల్ కమాండర్ జకి-ఉర్-రెహ్మాన్ లఖ్వీ; సజ్జిద్ మజీద్; ఇల్యాస్ కశ్మీరి, అబ్దుర్ రెహ్మాన్ హాషిమ్ సయ్యద్ అలియాస్ మేజర్ అలీ పేర్లను దర్యాప్తు మునుపటి దశల్లో పేర్కొంది. వీరిలో మేజర్ ఇక్బాల్ అలియాస్ మేజర్ అలీ.. మేజర్ సమీర్ అలీ అలియాస్ మేజర్ సమీర్‌తో సహా ISI అధికారులు కలిసి పనిచేశారని కూడా ఏజెన్సీ ఆరోపించింది. వీరందరూ ముంబయి దాడికి ప్రణాళిక, నిధులు, లాజిస్టిక్ వసతుల్లో కీలకంగా వ్యవహరించినట్టు అనుమానిస్తున్నారు.


సంజువన్ ఉగ్రదాడి.. ఎక్స్‌క్లూజివ్ దృశ్యాలు


రాణా, హెడ్లీ పాకిస్థాన్‌లో కలిసి సైనిక స్కూల్ చదువుకున్నారు. తరువాత ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీ వ్యాపారంలో భాగస్వాములయ్యారు. దీనిని ఉగ్రవాద కార్యకలాపాల కోసం ఒక వేదికగా ఉపయోగించారని అధికారులు ఆరోపిస్తున్నారు.


కస్టడీలో రాణాకు అత్యంత భద్రత


ఢిల్లీలోని సీజీఓ కాంప్లెక్స్‌లోని ఎన్ఐఏ ప్రధాన కార్యాలయంలోని ఓ గదిలో రాణాను ఉంచి విచారిస్తున్నారు. సాయుధ సీఆర్పీఎఫ్; ఢిల్లీ పోలీసు సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. లోపల, 24 గంటల నిఘా ఉంది. ప్రతి 24 గంటలకు ఒకసారి అతడికి వైద్య పరీక్ష నిర్వహిస్తారు. రాణా తన న్యాయవాదిని ప్రత్యామ్నాయ రోజుల్లో అధికారుల పర్యవేక్షణలో మాత్రమే కలవడానికి అనుమతిస్తారు.


ముంబయి దాడుల సమయంలో ఉగ్రవాదులతో పోరాడుతూ గాయపడిన పోలీస్ అధికారి సదానంద్ వసంత్ దాతే ప్రస్తుత ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్ కావడం చెప్పుకోదగ్గ అంశం. కామా ఆసుపత్రిపై దాడి చేసిన అజ్మల్ కసబ్, అబు ఇస్మాయిల్‌ను అడ్డుకునే క్రమంలో తీవ్ర గాయాల పాలయ్యారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com