ప్రజల తరఫున నిలబడిన ప్రతిసారీ, ప్రజల గొంతు వినిపించిన ప్రతీ సందర్భంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు తనకు నోటీసులు పంపుతున్నాయని ప్రముఖ వ్యాపారవేత్త, ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా పేర్కొన్నారు. తాను రాజకీయాల్లోకి రావాలని ఆలోచిస్తున్నట్లు గతంలో ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. గత 20 ఏళ్లలో తనకు 15 సార్లు నోటీసులు అందాయని, 10 గంటలపాటు విచారణలో కూర్చోబెట్టారని, అధికారులు అడిగిన అన్ని పత్రాలు అందజేశానని చెప్పుకొచ్చారు. తాజాగా గురుగ్రామ్ భూముల అమ్మకంలో మనీలాండరింగ్ జరిగిందన్న ఆరోపణలపై ఈడీ అధికారులు తనకు నోటీసులు పంపించారని తెలిపారు.ఈ కేసులో ఏమీలేదని, అధికారులు ఏమడిగినా జవాబు చెబుతానని స్పష్టం చేశారు. తాను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే తమ పనైపోతుందనే భయంతో ఇలా ప్రతీకార రాజకీయాలు చేస్తున్నారని పరోక్షంగా బీజేపీపై వాద్రా ఆరోపణలు గుప్పించారు. తాజా నోటీసులకు నిరసనగా వాద్రా ఢిల్లీలోని తన నివాసం నుంచి ఈడీ కార్యాలయం వరకూ నడుచుకుంటూ వెళ్లారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ పెద్దలు క్షుద్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని, కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.బీజేపీది రాజకీయ ప్రతీకారమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నోటీసులకు తాను భయపడబోనని తేల్చిచెప్పారు. అధికారుల విచారణకు సహకరిస్తానని, వారు ఏమడిగినా జవాబు చెబుతానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సంచలన ఆరోపణలు చేశారు. ‘మోదీకి భయం వేసినప్పుడల్లా ఈడీని ఉసిగొల్పుతారు’ అంటూ వాద్రా ఎద్దేవా చేశారు.
![]() |
![]() |