విశాఖపట్నంలోని మధురవాడ ఆర్టీసీ కాలనీలో సోమవారం జరిగిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాలనూ నివ్వెర పరిచింది. ఓ భర్త, తన భార్య పట్ల మరీ ఇంత అమానుషంగా ప్రవర్తిస్తాడా.. నిండు చూలాలని కూడా చూడకుండా ఇంత దారుణానికి ఒడిగడతాడా అని సభ్య సమాజమే దిగ్భ్రాంతికి లోనైంది. మనసిచ్చి మనువాడిన వాడు.. మానవత్వం మరిచిపోయి ప్రవర్తిస్తాడని.. ఏడేడు జన్మలూ తోడుంటాయని బాసలు చేసినవాడు, తన ఊపిరి తీస్తాడని ఊహించలేకపోయిన అనూష.. భర్త జ్ఞానేశ్వర్ చేతిలో బలైంది. అనూష మృతదేహానికి విశాఖపట్నం కేజీహెచ్ ఆస్పత్రిలో మంగళవారం పోస్టు మార్టం నిర్వహించారు.
అనూష గర్భం నుంచి ఆడ మృత శిశువును బయటకి తీశారు. అనూష మృతితో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న ఆమె బంధువులు చనిపోయిన ఆడ బిడ్డను చూసి మరింతగా రోదిస్తున్నారు. ప్రత్యక్షంగా భార్యను, పరోక్షంగా బిడ్డను హత్య చేసిన జ్ఞానేశ్వర్‌ను కఠినంగా శిక్షించాలని అనూష కుటుంబసభ్యులు కోరుతున్నారు. మరోవైపు జ్ఞానేశ్వర్‌ను పీఎం పాలెం పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం భీమిలి కోర్టులో హాజరుపరచగా.. జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో జైలుకు తరలించారు. మరో పెళ్లి చేసుకోవాలనే ఆలోచనతోనే జ్ఞానేశ్వర్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలిసింది.
![]() |
![]() |