తెలుగుదేశం పార్టీ ప్రతీ ఏటా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే మహానాడుపై దృష్టి సారించింది. నిన్నటి వరకు అమరావతి పునర్నిర్మాణ సభ పనులతో బిజీగా ఉన్న టీడీపీ నాయకత్వం అది విజయవంతంగా ముగియడంతో.. ఇప్పుడు పార్టీకి సంబంధించిన పెద్ద పండుగ మహానాడుపై దృష్టి సారించింది. ఈ క్రమంలో తాజాగా మహానాడు నిర్వహణకు ప్లేస్ ఫిక్స్ చేసింది. దీని ప్రకారం జగన్ అడ్డా కడపలో ఈ సారి పసుపు పండుగ జరగనుంది.
ఇక ఈనెల 27వ తేదీ నుంచి మూడు రోజులపాటు మహానాడును నిర్వహించనున్నారు. ఇప్పటికే సంబంధిత జిల్లా నేతలు మహానాడు ఏర్పాట్లు షురూ చేశారు. మూడు రోజుల పాటు జరిగే మహానాడు సభకు ఇరు రాష్ట్రాల నుంచి టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. వారందరికి అన్నీ సౌకర్యాలు కల్పించేలా ఏర్పాట్లు చేసేందుకు టీడీపీ నేతలు రెడీ అవుతున్నారు.
ఈ ఏడాది మహానాడును మే నెల 27 నుంచి మూడు రోజులపాటు.. కడప జిల్లా కేంద్రంలో నిర్వహించాలని తెలుగుదేశం అధిష్ఠానం నిర్ణయించింది. ఈ క్రమంలోపార్టీ ఎమ్మెల్సీలు బీద రవిచంద్రా, దామచర్ల సత్య, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణరాజు కడపకు వెళ్లి.. సభా వేదిక నిర్మాణం కోసం పలు ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం కడప సమీపంలోని సీకే దిన్నె మండలం చెర్లోపల్లి, పబ్బాపురం గ్రామాల పరిధిలోని భూములను పార్టీ అధిష్ఠానం అనుమతితో.. మహానాడు కోసం ఎంపిక చేశారు.
అంతేకాక మహానాడు ప్రాంగణం, భోజన ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్‌కుకూడా స్థలాలను ఎంపిక చేశారు. ఈ స్థలం కడపను తిరుపతి, చిత్తూరు, అనంతపురం, హైదరాబాద్ మార్గాలతో కలిపేదిగా ఉందని నేతలు చెబుతున్నారు. స్థలాల ఎంపికకు సంబంధించి సభ తర్వాత కానీ.. ముందు కానీ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకునేలా.. భూముల యాజమానుల నుంచి నిరభ్యంతర పత్రాలు తీసుకున్నారు.
మహానాడు 2025 పనులకు సంబంధించి ఈ నెల 7న భూమిపూజ నిర్వహించి, శరవేగంగా పనులు పూర్తి చేయాలని నేతలు నిర్ణయించారు. అలానే మహానాడు కార్యక్రమం సందర్భంగా నారా లోకేష్‌కు పార్టీలో మరింత కీలకమైన బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది అంటున్నారు.
తెలుగుదేశం పార్టీ మహానాడు ఏర్పాట్లలో వంటలు ఎప్పుడూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ వేడుకకు హాజరయ్యే వేలాది మంది కార్యకర్తలకు రుచికరమైన, సాంప్రదాయ వంటకాలను వడ్డిస్తారు. ప్రతి సంవత్సరం, మహానాడులో వంటల ప్రత్యేకతలు మారుతూ ఉంటాయి. సాధారణంగా మహానాడు భోజనాలలో.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సాంప్రదాయ వంటకాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. పులిహోర, దద్దోజనం, పొంగలి, సాంబారు, రసం, కూరలు, పప్పు, పెరుగు, మజ్జిగ వంటి వంటకాలు తప్పనిసరిగా ఉంటాయి. స్థానిక రుచులకు అనుగుణంగా ప్రత్యేక వంటకాలు కూడా తయారు చేస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa