ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపిస్ట్ నాలుక కొరికిందని అత్యాచార బాధితురాలికి శిక్ష.. 61 ఏళ్ల పోరాటం తర్వాత నిర్దోషిగా తీర్పు

international |  Suryaa Desk  | Published : Tue, Sep 16, 2025, 08:16 PM

కన్ను మిన్నూ కానని కామాంధులు.. మహిళలపై అత్యాచారానికి తెగబడుతుంటే.. సాధారణంగానే వారు ప్రతిఘటిస్తూ ఉంటారు. తన మానాన్ని కాపాడుకునేందుకు.. ఎదురుగా ఉన్నది పురుషుడైనా, ఎంతటి బలశాలి అయినా.. తన శక్తిమేరకు ఆమె పోరాడుతూనే ఉంటుంది. ఆ దుర్మార్గుడి నుంచి తనను తాను రక్షించుకునేందుకు.. చేతికి ఏది దొరికితే దానితో దాడి చేస్తుంది. ఇలాంటి సమయాల్లో మహిళ దాడిలో అలాంటి రేపిస్ట్‌లు చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే తనపై ఒక దుర్మార్గుడు అత్యాచారం చేస్తుండగా.. అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఓ యువతి.. ఏం చేయాలో తెలియక.. అతడి నాలుకను కొరికేసింది. దీంతో ఆమె అక్కడి నుంచి పారిపోయింది. కానీ నిందితుడిపై అత్యాచారం కేసు పెట్టని పోలీసులు.. అతడ్ని కోర్టులో ప్రవేశపెట్టగా 6 నెలల జైలు శిక్ష విధించారు. అదే అతడి నాలుక కొరికినందుకు ఆ యువతికి 10 నెలల జైలు శిక్ష వేశారు. ఈ తీర్పు అప్పట్లో వివాదాస్పదం కాగా.. 61 ఏళ్ల తర్వాత ఆమె ఈ కేసులో నిర్దోషి అని తేల్చారు.


దక్షిణ కొరియాలో జరిగిన ఈ దశాబ్దాల నాటి కేసు విచారణలో కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఆ మహిళ నిర్దోషి అని తీర్పు చెప్పడంతో.. సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అత్యాచార ఘటన జరిగినపుడు బాధితురాలు చోయ్ మాల్ జా వయసు 18 ఏళ్లు కాగా.. నిందితుడి వయసు 21 ఏళ్లు. అయితే తనపైనే లైంగిక దాడి జరగడమే కాకుండా.. ఆత్మ రక్షణ కోసం తాను అతడిపై దాడి చేస్తే.. నిందితుడి కంటే తనకే ఎక్కువ శిక్ష విధించడంపై ఆమె గత 6 దశాబ్దాలకుపైగా న్యాయపోరాటం చేస్తుండగా.. ఇప్పటికి విజయం వరించింది. దీంతో ఈ కేసులో విజయం తర్వాత ఆమె పరిహారం కోసం అప్పీలు చేసుకోవాలని భావిస్తోంది.


గతంలో చోయ్ మాల్ జా 18 ఏళ్లు ఉన్నపుడు.. 21 ఏళ్ల ఓ వ్యక్తి.. ఆమెపై అత్యాచారం చేసేందుకు విశ్వప్రయత్నాలు చేశాడు. దీంతో ఆ కామాంధుడి నుంచి రక్షించుకునేందుకు.. చోయా మాల్ జా.. అతని నాలుకను కొరికింది. ఈ వ్యవహారం అప్పట్లో కోర్టుకు ఎక్కగా.. విచారణ జరిపిన న్యాయమూర్తులు సంచలన తీర్పును వెలువరించారు. అత్యాచార నిందితుడిపై యువతి.. శారీరకంగా తీవ్ర హాని కలిగించేలా దాడి చేసిందని పేర్కొంటూ ఆమెకు కోర్టు 10 నెలల జైలు శిక్ష విధించింది. అయితే ఆమెపై దాడి చేసిన వ్యక్తికి మాత్రం కేవలం 6 నెలల శిక్ష మాత్రమే వేయడం విచిత్రం. అంతేకాకుండా.. అత్యాచారం చేసేందుకు యత్నించినట్లు కేసు కూడా పెట్టకపోవడం గమనార్హం.


ఇక ఈ కేసులో నిందితుడి కంటే తనకే ఎక్కువ శిక్ష పడటంతో.. ఆ తీర్పును సవాలు చేస్తూ చోయ్ మాల్ జా గత కొన్ని దశాబ్దాలుగా ఒంటరిగా పోరాటం చేశారు. చివరికి ఈ కేసులో ఆశలు వదిలేసుకుంటున్న సమయంలో.. 2018లో దక్షిణ కొరియాలో మీటూ ఉద్యమం ప్రారంభమైంది. అయితే అదే ఆమె దశాబ్దాల పోరాటానికి సరికొత్త దారిని చూపించింది. మీటూ ఉద్యమ స్ఫూర్తితో.. చోయ్ మాల్ జా.. లాయర్లను సంప్రదించి.. తన కేసును తిరిగి విచారణ జరిపించేలా పిటిషన్ వేయాలని నిర్ణయించుకుని ఆ దిశగా ప్రయత్నాలు చేసింది. అయితే కేసును పునర్విచారణ జరపాలన్న ఆమె విజ్ఞప్తిని కింది కోర్టులు తిరస్కరించినా.. ఆమె పోరాటం మాత్రం ఆపకుండా చివరికి సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో.. అక్కడ ఊరట లభించింది.


ఈ క్రమంలోనే ఈ కేసులో మొదట ఇచ్చిన తీర్పుపై బుసాన్ జిల్లా కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా ప్రాసిక్యూటర్లు చోయ్ మాల్ జాకు క్షమాపణలు చెప్పారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. చోయ్ మాల్ జా.. నిందితుడి నాలుక కొరకడం.. రేప్ నుంచి తప్పించుకునేందుకు ఆమె ఆత్మరక్షణలో భాగంగా తీసుకున్న చర్య అని తేల్చింది. దీంతో ఈ కేసులో సుదీర్ఘ పోరాటం తర్వాత ఆమెను నిర్దోషిగా ప్రకటించింది. దీంతో ఆమె మద్దతుదారులు విజయ ధ్వనులు చేశారు.


61 ఏళ్ల పోరాటం తర్వాత కోర్టు ఇచ్చిన సంచలన తీర్పు తర్వాత చోయ్ మాల్ జా స్పందించారు. ఇక నుంచి తాను ఈ కేసులో ఒక బాధితురాలిగా కాకుండా.. నిర్దోషిగా గుర్తింపు పొందుతానని వెల్లడించారు. ఈ సందర్భంగా గత కొన్ని దశాబ్దాలుగా తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ ఆమె కృతజ్ఞతలు చెప్పారు. తాజాగా ఇచ్చిన తీర్పు లింగ వివక్షతో కూడిన పాత ధోరణులను మార్చేసి.. భవిష్యత్‌లో లైంగిక దాడి బాధితులకు న్యాయం జరిగేందుకు ఒక మార్గం చూపేలా ఉందని చోయ్ మాల్ జా తరఫున వాదనలు వినిపించిన లాయర్ కిమ్ సూ జంగ్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే గత 6 దశాబ్దాలకు పైగా తాను అనుభవించిన బాధ, నిందలకు పరిహారం కోసం దక్షిణ కొరియా ప్రభుత్వంపై దావా వేయాలని చోయ్ మాల్ జా భావిస్తున్నట్లు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa