భారత్‌కు అమెరికా తదుపరి రాయబారిగా డొనాల్డ్ ట్రంప్ అత్యంత సన్నిహితుడు, విశ్వాసపాత్రుడు అయిన సెర్జియో గోర్ (38) నియామకం ఖరారైంది. మంగళవారం అమెరికా సెనేట్‌లో జరిగిన ఓటింగ్‌లో ఆయన నియామకానికి ఆమోదముద్ర లభించింది. దీంతో భారత్‌లో అమెరికా రాయబారిగా పనిచేయనున్న అత్యంత పిన్నవయస్కుడిగా సెర్జియో గోర్ రికార్డు సృష్టించనున్నారు. ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్‌కు కూడా ఆయన అత్యంత సన్నిహితుడు.గతంలో ట్రంప్ పరిపాలనలో 4,000కు పైగా కీలక నియామకాలను పర్యవేక్షించిన వైట్ హౌస్ ప్రెసిడెన్షియల్ పర్సనల్ ఆఫీస్ డైరెక్టర్‌గా గోర్ పనిచేశారు. ఆగస్టు 22న తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’ వేదికగా గోర్ పేరును ట్రంప్ ప్రతిపాదించారు. "ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న ప్రాంతానికి, నా ఎజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు నేను పూర్తిగా విశ్వసించగల వ్యక్తి అవసరం. సెర్జియో ఒక అద్భుతమైన రాయబారి అవుతారు," అని ట్రంప్ ఆనాడు పేర్కొన్నారు.సెప్టెంబర్‌లో సెనేట్ హియరింగ్ సందర్భంగా సెర్జియో గోర్ మాట్లాడుతూ.. "భారత్ ఒక కీలక వ్యూహాత్మక భాగస్వామి. ఆ దేశ భౌగోళిక ఉనికి, ఆర్థిక వృద్ధి, సైనిక సామర్థ్యాలు ఈ ప్రాంతంలో స్థిరత్వానికి మూలస్తంభం వంటివి" అని అన్నారు. ఇరు దేశాల మధ్య రక్షణ సహకారం, న్యాయమైన వాణిజ్యం, ఇంధన భద్రత, సాంకేతికత వంటి రంగాల్లో సంబంధాలను మరింత బలోపేతం చేయడమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. "రెండు దేశాల మధ్య సైనిక విన్యాసాలను విస్తరించడం, రక్షణ వ్యవస్థల ఉమ్మడి అభివృద్ధి, కీలకమైన ఆయుధ ఒప్పందాలను పూర్తి చేయడం నా ప్రాధాన్యతలు" అని గోర్ వివరించారు.భారత్‌లో ఉన్న 140 కోట్ల జనాభా, వేగంగా అభివృద్ధి చెందుతున్న మధ్యతరగతి వర్గం అమెరికాకు అపారమైన అవకాశాలను అందిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి ఫార్మాస్యూటికల్స్ వరకు అనేక రంగాల్లో కలిసి పనిచేసేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కాగా, ఇటీవల ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సెర్జియో గోర్, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో న్యూయార్క్‌లో సమావేశమయ్యారు. భారత్‌కు రాయబారితో పాటు దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల ప్రత్యేక రాయబారిగా కూడా గోర్ అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa