ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హెచ్-1బీ వీసాపై మరిన్ని కఠిన నిబంధనలకు ట్రంప్ ప్లాన్

international |  Suryaa Desk  | Published : Fri, Oct 10, 2025, 09:43 PM

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఇమ్మిగ్రేషన్ విషయంలో డొనాల్డ్ ట్రంప్ కఠిన వైఖరి అవలంభిస్తున్నారు. ఇటీవలే హెచ్-1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా, హెచ్-1బీ వీసాకు సంబంధించి మరిన్ని కఠిన నిబంధనలు తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. వీసా అనుమతిని యజమానులు ఎలా ఉపయోగిస్తారు, ఎవరు దీనికి అర్హులు అనే అంశాలపై షరతులు విధింపునకు సిద్ధమవుతోంది. హెచ్-1బీ వీసాలో మార్పులకు సంబంధించిన ఈ మేరకు హోమ్‌లాండ్ సెక్యూరిటీ విభాగం ప్రతిపాదనలు చేసింది.


‘హెచ్-1బీ వీసా నాన్-ఇమ్మిగ్రెంట్ వర్గీకరణ ప్రోగ్రామ్‌ సంస్కరణలు’ పేరుతో ఫెడరల్ రిజిస్టర్ అధికారికంగా జాబితా చేసిన ఈ ప్రతిపాదనల్లో పలు సాంకేతిక అంశాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా క్యాప్ మినహాయింపుల అర్హత ప్రమాణాలను సవరించడం, వీసా ప్రోగ్రామ్ నిబంధనలను ఉల్లంఘించిన యజమాన్యాలపై కఠినంగా వ్యవహరించడం, థర్డ్ పార్టీ నియామకాలపై పర్యవేక్షణను పెంచడం వంటి నిబంధనలు ఉన్నాయి.


అయితే, హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం వార్షిక వీసా పరిమితి నుంచి మినహాయింపునకు అర్హులైన యాజమాన్యాలు, ఉద్యోగాల పరిధిని తగ్గించాలనే యోచనలో ఉందా? లేదా; అన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అయితే ట్రంప్ యంత్రాంగం ఇందులో మార్పులు చేస్తే, ప్రస్తుతం మినహాయింపుల వల్ల ప్రయోజనం పొందుతున్న లాభాపేక్షలేని పరిశోధనా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఆరోగ్య సంరక్షణ సంస్థలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని న్యూస్‌వీక్ నివేదించింది.


‘‘ఈ మార్పులు హెచ్-1బీ వీసా నాన్-ఇమ్మిగ్రెంట్ ప్రోగ్రామ్‌ను మరింత బలోపేతం చేయడమే కాకుండా, అమెరికా కార్మికుల వేతనాలు, ఉద్యోగాలను మెరుగ్గా రక్షించేందుకు ఉద్దేశించినవి’’ అని ప్రతిపాదనలో పేర్కొన్నారు. దీంతో అమెరికాలో ఉద్యోగం చేయాలనే ఆశించే వేలాది మంది భారతీయ విద్యార్థులు, యువ నిపుణులపై ప్రభావం చూపుతాయని అంచనా. నోటీసు ప్రకారం.. డిసెంబరు 2025లో ఈ నియమావళి అధికారికంగా ప్రచురించే అవకాశం ఉంది. ఇంతకుముందు వచ్చిన నివేదికల ప్రకారం.. ట్రంప్ సర్కారు సాంప్రదాయ హెచ్-1బీ వీసా లాటరీ వ్యవస్థను వేతన ఆధారిత ఎంపిక విధానంతో భర్తీ చేయాలనే ఆలోచనలో ఉందని సమాచారం.


హెచ్-1బీ వీసా ఎందుకంత ముఖ్యం?


హెచ్-1బీ ఒక తాత్కాలిక వీసా అయినప్పటికీ, ఇది భారతీయులను సహా అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ కార్మికులకు అత్యంత ముఖ్యమైంది. అమెరికాలో దీర్ఘకాలంగా పనిచేయడానికి, అలాగే భవిష్యత్తులో స్థిర నివాస హోదా (గ్రీన్ కార్డు) పొందే దిశగా అడుగులు వేయడానికి దీనిని ఏకైక మార్గంగా పరిగణిస్తారు. 1990 వలస చట్టం ద్వారా అమల్లోకి వచ్చిన హెచ్-1బీ వీసా విధానం ఉద్దేశం అమెరికా కంపెనీలు సాంకేతిక నైపుణ్యాలు కలిగిన విదేశీయులను నియమించుకోవడానికి అవకాశం కల్పించడం. ఈ వీసా కార్యక్రమం శాశ్వత నివాసానికి ఉద్దేశించింది కాదు. కానీ, కొంతమంది దీని ద్వారా ఇమ్మిగ్రేషన్ స్టేటస్ మార్చుకొని చివరికి శాశ్వత నివాసం పొందుతారు.


అమెరికా ప్రభుత్వం ఏటా 65,000 హెచ్-1బీ వీసాలు మాత్రమే జారీ చేస్తుంది. అలాగే, అమెరికా యూనివర్సిటీలు లేదా అంతకంటే ఉన్నత డిగ్రీ పొందిన వ్యక్తుల కోసం 20,000 అదనంగా ఇస్తుంది. వీటిని లాటరీ విధానంలో కేటాయిస్తారు. అయితే విశ్వవిద్యాలయాలు, లాభాపేక్షలేని సంస్థలకు ఈ పరిమితి నుంచి మినహాయింపు ఉంటుంది.


ప్యూ రిసెర్చ్ సెంటర్ నివేదిక ప్రకారం.. 2023లో ఆమోదించిన మొత్తం దరఖాస్తుల్లో మూడొంతులు ఇండియా నుంచే వచ్చినవే. ఇక, 2012 నుంచి ఇప్పటివరకు ఆమోదించిన హెచ్-1బీ వీసాలలో కనీసం 60 శాతం కంప్యూటర్‌ సంబంధిత ఉద్యోగాల కోసం మంజూరైనవేనని ప్యూ రిసెర్చ్ సెంటర్‌ తెలిపింది. అయితే ఆసుపత్రులు, బ్యాంకులు, విశ్వవిద్యాలయాలు, విభిన్న రంగాల యజమాన్యాల కూడా హెచ్-1బీ వీసాల కోసం దరఖాస్తు చేస్తున్నారు.


అధ్యయన ప్రకారం.. హెచ్-1బీ వీసా కలిగిన విదేశీ నిపుణులు సాధారణంగా అమెరికన్ల వేతనాలకు సమానంగా లేదా అంతకంటే ఎక్కువ వేతనం పొందుతారు. ఇది అమెరికా చట్టం ప్రకారం తప్పనిసరి. ఎందుకంటే యజమాన్యాలు ప్రభుత్వ ఫీజులతో పాటు (సాధారణంగా 6,000 డాలర్లు కంటే ఎక్కువ) అదే అర్హతలు, అనుభవం కలిగిన అమెరికా నిపుణులకు చెల్లించే ప్రస్తుత లేదా అధిక వేతనం ఏది ఉంటే దానినే చెల్లించాల్సి ఉంటుంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa