ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అబ్దుల్లాపూర్‌మెట్‌ ఇంజనీరింగ్ కాలేజీలో భారీ దొంగతనం

Crime |  Suryaa Desk  | Published : Fri, Oct 10, 2025, 09:51 PM

ఏమాత్రం కష్టపడకూడదు.. చిన్న పని కూడా చేయకూడదు.. కానీ జల్సాలు చేయాలి.. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తూ ఎంజాయ్ చేయాలి. ఇందుకోసం ఎలాంటి దారుణాలకైనా పాల్పడదాం.. ఇతరుల కష్టాన్ని దోచుకుని.. లగ్జరీగా బతుకుదాం అనుకునే వారి సమాజంలో రోజు రోజుకు పెరుగుతున్నారు. మరీ ముఖ్యంగా కొందరు యువతీయువకులు ఈజీ మనీకి అలవాటు పడి.. దొంగతనాలు, దోపిడీలకు పాల్పడుతూ.. ఇతరుల కష్టాన్ని దోచుకుంటున్నారు. గతంలో అయితే ఎక్కువగా ఇళ్లు, ఆలయాలు, బ్యాంకుల్లో చోరీ చేసేవారు. ఇప్పుడు విద్యా సంస్థలను కూడా వదలడం లేదు. తాజాగా హైదరాబాద్‌లోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో భారీ దోపిడీ వెలుగు చూసింది. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే దోపిడీ జరిగింది కాంగ్రెస్ ఎమ్మెల్యే కాలేజీలో. ఆ వివరాలు..


అబ్దుల్లాపూర్ మెట్‌లో ఉన్న బ్రిలియంట్ ఇంజనీరింగ్ కళాశాలలో భారీ దోపిడి జరిగింది. ఈ కాలేజీ కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి చెందినది కావడం గమనార్హం. కాలేజీలో దొంగతనానికి పాల్పడిన దుండగులు రూ.కోటి నగదు దోచుకెళ్లినట్లు తెలిసింది. గురువారం అర్ధరాత్రి ఈ దోపిడీ చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..


గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత గుర్తు తెలియని దుండగులు కొందరు కాలేజీకి ప్రవేశించారు. లాకర్లను పగలకొట్టి.. దానిలో దాచిన కోటి రూపాయల నగదును దోచుకెళ్లారు. దోపిడీ గురైన మొత్తం ఒకే కాలేజీకి చెందిన సొమ్ము కాదు. బ్రిలియంట్ కాలేజీకి సంబంధించిన డబ్బుతో పాటు, మరో రెండు అనుబంధ ఇంజనీరింగ్ కాలేజీలకు చెందిన నగదు కూడా ఇదే లాకర్‌లో భద్రపరిచారని తెలుస్తోంది.


దొంగతనానికి పాల్పడిన దుండుగులు..సేఫ్ లాకర్స్‌ను బద్దలు కొట్టి డబ్బును ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. పైగా దీనికి సంబంధించి పోలీసులకు ఎటువంటి ఆధారాలు దొరక్కుండా జాగ్రత్త పడ్డారు. కాలేజీలో అమర్చిన 200 సీసీ కెమెరాలకు సంబంధించిన డీవీఆర్‌ను కూడా దుండగులు తమతో పాటు తీసుకెళ్లారు. ఈ దోపిడీని ఒక్కరే చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, బ్రిలియంట్ కాలేజీలో విచారణ జరుపుతున్నారు.


దొంగతనానికి పాల్పడిన వారు చిన్న ఆధారం కూడా దొరక్కుండా జాగ్రత్త పడటంతో కేసును ఛేదించేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇక కాలేజీలో దొంగతనం జరగడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితులను త్వరగా పట్టుకోవాలని పోలీసులకు కోరుతున్నారు. విద్యార్థులకు గట్టి భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే కాలేజీలో చోరీ జరగడం మాత్రం సంచలనంగా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa