ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తుపాను బాధితులకు తక్షణ సాయం సమీక్షలో సీఎం కీలక ఆదేశాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 29, 2025, 10:28 PM

మొంథా తుపాను సృష్టించిన బీభత్సం నుంచి ప్రజలను, రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. పంట నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలతో ఐదు రోజుల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది వేగంగా నష్టాన్ని అంచనా వేసేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అదే సమయంలో, తుపాను కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు ప్రకటించారు. బుధవారం ఉదయం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, ప్రజల ఇబ్బందులను స్వయంగా తెలుసుకున్న ముఖ్యమంత్రి, సాయంత్రం సచివాలయంలోని ఆర్టీజీ కేంద్రంలో ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సహాయక, పునరుద్ధరణ చర్యలపై పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.సమావేశంలో అధికారులు తుపాను వల్ల జరిగిన నష్టాన్ని ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 304 మండలాల్లోని 1,825 గ్రామాల్లో సుమారు 87 వేల హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశామని తెలిపారు. ఇందులో 59 వేల హెక్టార్లకు పైగా వరి పంట నీట మునిగిందని, ప్రత్తి, మొక్కజొన్న, మినుము వంటి ఇతర పంటలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా 78,796 మంది రైతులు నష్టపోయారని, 42 పశువులు కూడా మృత్యువాత పడ్డాయని వివరించారు. అయితే ఇది కేవలం ప్రాథమిక అంచనా మాత్రమేనని, క్షేత్రస్థాయిలో వాస్తవ నష్టం ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడ్డారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి, వ్యవసాయ శాస్త్రవేత్తలు వెంటనే దెబ్బతిన్న పొలాలను సందర్శించి, పంటలను కాపాడుకునే మార్గాలపై రైతులకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని నిర్దేశించారు.విద్యుత్, రవాణా పునరుద్ధరణే లక్ష్యం సహాయక చర్యల పురోగతిని అడిగి తెలుసుకున్న చంద్రబాబు, విద్యుత్ సరఫరా, రహదారుల పునరుద్ధరణ పనులను తక్షణమే పూర్తి చేయాలని ఆదేశించారు. బుధవారం రాత్రికి అన్ని ప్రాంతాలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని, గురువారం నాటికి దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు పూర్తి చేయాలని గడువు విధించారు. ఈ పనుల్లో ఎలాంటి అలసత్వం ప్రదర్శించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏపీఎస్ ఆర్టీసీ బస్సు సర్వీసులను యధావిధిగా కొనసాగించాలని సూచించారు. దీనిపై అధికారులు స్పందిస్తూ కూలిపోయిన విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తున్నామని, ఫీడర్లను పునరుద్ధరిస్తున్నామని తెలిపారు.ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి కలెక్టర్‌పై అసహనం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పారిశుధ్య పనులు ముమ్మరం చేయాలని, ఎక్కడా నీరు నిలిచిపోకుండా డ్రైనేజీలను శుభ్రపరచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న ప్రతి కుటుంబానికి గురువారం నాటికల్లా బియ్యం, నిత్యావసర సరుకులు అందజేయాలని స్పష్టం చేశారు. తాగునీరు కలుషితం కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని, డయేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా రూరల్ వాటర్ సప్లయ్ అధికారులు చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఒంగోలు పట్టణంలోని పలు కాలనీలు నీట మునగడంపై ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు పనితీరుపై ముఖ్యమంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి పాలనా వైఫల్యాలు పునరావృతం కావొద్దని, విపత్తుల నిర్వహణలో పాఠాలు నేర్చుకోవాలని సూచించారు. ప్రతి జిల్లా ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అన్నారు.మొంథా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని 249 మండలాలు, 1,434 గ్రామాలు, 48 మున్సిపాలిటీల్లోని దాదాపు 18 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యగా 1,209 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి, 1.16 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. తుపాను కారణంగా రాష్ట్రంలో 380 కిలోమీటర్ల పంచాయతీరాజ్ రహదారులు, 14 వంతెనలు, కల్వర్టులు దెబ్బతినడంతో రూ. 4.86 కోట్ల నష్టం వాటిల్లింది. అలాగే 2,294 కిలోమీటర్ల ఆర్ అండ్ బీ రోడ్లకు రూ. 1,424 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా. గ్రామీణ నీటి సరఫరా విభాగానికి రూ. 36 కోట్లు, జలవనరుల శాఖకు రూ. 16.45 కోట్ల నష్టం జరిగింది. సహాయక చర్యల్లో భాగంగా 3,175 మంది గర్భిణీలను ఆసుపత్రులకు తరలించగా, 2,130 వైద్య శిబిరాలు నిర్వహించారు. రహదారులపై విరిగిపడిన 380 చెట్లను తొలగించి రవాణాకు అంతరాయం లేకుండా చేశారు. తుపాను తీరం దాటడంతో వర్షాలు తగ్గుముఖం పట్టాయని, ప్రభుత్వ చర్యలపై ప్రజల నుంచి సంతృప్తి వ్యక్తమవుతోందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa