ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాశీబుగ్గ ఆలయంలో తోపులాట క్షతగాత్రులను పరామర్శించి, ఘటనా స్థలాన్ని పరిశీలించిన మంత్రులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 02, 2025, 06:38 AM

శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకోవడం తెలిసిందే. కాశీబుగ్గలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 9 మంది భక్తులు దుర్మరణం చెందగా, మరో 16 మంది గాయపడ్డారు. ఊహించని రీతిలో భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఈ దురదృష్టకర ఘటన జరిగిందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఘటన జరిగిన వెంటనే ఆయన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, హోంమంత్రి వంగలపూడి అనితతో కలిసి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటన జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలాసలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్యాన్ని, వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలాస సీహెచ్ సీ వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి నారా లోకేశ్ మాట్లాడారు. ఈ రోజు కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద చాలా బాధాకరమైన ఘటన జరిగింది. ఏకాదశి సందర్భంగా భక్తులు పెద్దఎత్తున ఆలయానికి వెళ్లారు. అక్కడ ఆలయ ప్రవేశమార్గం వద్ద తోపులాట జరిగి 9 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 16 మంది గాయపడ్డారు. ముగ్గురిని స్పెషాలిటీ కేర్ కోసం శ్రీకాకుళం జేమ్స్ ఆసుపత్రికి ప్రభుత్వం తరలించడం జరిగింది. 94 ఏళ్ల భక్తుడు పండా ప్రజల కోసం సొంత ఖర్చుతో వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించారు. ఈ రోజు ఇక్కడకు వచ్చిన చాలా మంది భక్తులు మొదటిసారి వచ్చినవారు. కేవలం 10 శాతం మందే రెండు, మూడోసారి వచ్చారు.ఈ దేవాలయాన్ని గత నాలుగైదేళ్లు నిర్మిస్తూ వచ్చి నాలుగు నెలల క్రితం ప్రతిష్టాపన చేశారు. ఇక్కడ స్థానికంగా ఉన్న అధికారులు, పోలీసులకు ఇంతమంది భక్తులు తరలివస్తారని తెలియలేదు. గతంలో తాము వచ్చినప్పుడు ఎలాంటి రద్దీ లేకుండా దర్శనం చేసుకుని వెళ్లేవాళ్లమని రెండోసారి వచ్చిన భక్తులు తెలిపారు. ఈసారి ఎప్పుడూ లేని విధంగా పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారని చెప్పారు. అక్కడ పైకి వెళ్లేటప్పుడు రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి వెళ్లేందుకు, మరొకటి వచ్చేందుకు. దేవాలయంలో ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దర్శనం ఏర్పాటుచేశారు. తర్వాత మూడు నాలుగు గంటలు విరామం ఇచ్చారు. తర్వాత సాయంత్రం దర్శనం ఏర్పాటుచేశారు. ఉదయం వెళ్లిన భక్తులు ఉదయం 11.30 ప్రాంతంలో ఎంట్రీ మార్గంలో వెళ్లారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆలయం మూసివేస్తారు కనుక ఎంట్రీ మార్గం మూసివేయడం జరిగింది. లోపల ఉన్న భక్తులు దర్శించుకుని బయటకు వస్తున్నారు. బయట ఉన్న వారు మళ్లీ సాయంత్రం వరకు వేచి ఉండాలనే ఉద్దేశంతో కొంతమంది లోపలికి వెళ్లి దర్శనం చేసుకోవాలని భావించారు. ఒకే మార్గం ఉంది కనుక అక్కడ తోపులాట జరిగింది. పై మెట్లలో ఉన్నవారు ఒక్కొక్కరు కిందవరకూ పడుతూ వచ్చారు.ఆలయం వద్ద బ్యారికేడింగ్ చేశారు. అయితే బ్యారికేడింగ్ ఫౌండేషన్ రెండున్నర అంగుళాలు మాత్రమే చేశారు. ఎక్కువ మంది భక్తులు వచ్చినప్పుడు కనీసం ఆరు అంగుళాలు వేస్తారు. ఇది చేయలేకపోయారు. ఒక సైడ్ లో అయితే బ్యారికేడింగ్ తర్వాత డైరెక్ట్ సిమెంటే ఉంది. అటువైపు పడిన వారు చాలా ఇబ్బంది పడ్డారు. కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. నాకు సమాచారం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే శిరీష గారికి ఫోన్ చేశాను. వెంటనే ఆమె బయలుదేరారు. తర్వాత మంత్రి అచ్చెన్నాయుడు గారికి ఫోన్ చేశాను. అధికారులతో మాట్లాడాను. అందరూ యుద్ధప్రాతిపదికిన ప్రాంగణానికి వచ్చి సీరియస్ గా ఉన్నవారిని శ్రీకాకుళానికి తరలించారు. గాయపడిన వారిని పలాస ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేయడం జరిగింది.ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈ ఘటన జరిగినప్పుడు హెలికాఫ్టర్ లో ఉన్నారు. కదిరిలో ల్యాండ్ అయిన వెంటనే ఆయనతో మాట్లాడటం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవాలయాలన్నింటి కార్యక్రమాలు, ముఖ్యమైన తేదీలు గతంలో ఎంత మంది భక్తులు వచ్చారు, రాబోయే రోజుల్లో ఎంతమంది భక్తులు వస్తారో ముందే వివరాలు సేకరించి, సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటుచేసి, క్రౌడ్ మానిటరింగ్ కు టెక్నాలజీ వినియోగించాలని సీఎం గారు కలెక్టర్లు, ఎస్పీలందరికీ ఆదేశాలు జారీ చేశారు. దేవాదాయ శాఖ కింద ఉన్న దేవాలయాలకు ఒక వ్యవస్థ ఉంటుంది. ప్రైవేటు వ్యక్తులు దేవాలయాలు నిర్మించినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా ఎస్ వోపీ రూపొందించాలని ఆదేశించారు. దీనిని ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంటోంది. అనుకోకుండా ఘటన జరిగింది. ముఖ్యమంత్రి గారి పర్యటన తర్వాత భవిష్యత్ కార్యాచరణపై మంత్రివర్గం నిర్ణయాలు తీసుకుంటుంది. పండా గారు 94 ఏళ్ల వ్యక్తి. సమాజంలో మంచి పేరున్న వ్యక్తి. ప్రజలకు దేవుడిని దగ్గర చేయాలనే ఆలోచనతో ఈ దేవాలయాన్ని నిర్మించారు. 12 ఎకరాల్లో రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు ఖర్చు చేశారు. దశల వారీగా దేవాలయాన్ని నిర్మించారు. వివరాలన్నీ సేకరించిన తర్వాత భవిష్యత్ కార్యాచరణను ప్రభుత్వం ప్రకటిస్తుందన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa