అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఫ్రీ హోల్డ్‌లో ఉంచిన 5,74,908 ఎకరాల అసైన్డ్ భూముల వివరాలను పునఃపరిశీలించాలని నిర్ణయించారు. గత ఏడాది జూన్ 15 నుంచి ఈ ఏడాది డిసెంబర్ 1వ తేదీ వరకు 5,28,217 గ్రీవెన్సులు రాగా.. అందులో 4,55,189 గ్రీవెన్సులు పరిష్కరించినట్లు తెలిపారు. మరో 73 వేల వరకు గ్రీవెన్సులు పరిశీలనలో ఉన్నట్లు వెల్లడించారు. రెవెన్యూ శాఖపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ సాయి ప్రసాద్, సీసీఎల్ఏ అధికారులు హాజరయ్యారు.
పీజీఆర్ఎస్ సహా 22ఏ, ఫ్రీ హోల్డ్‌లో ఉంచిన అసైన్డ్ భూములు, రీ సర్వే, ఆదాయ, కుల ధృవీకరణ పత్రాలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు. పాలనా సంస్కరణలతో ఈ ఏడాది జూన్ నుంచి ఆటోమ్యూటేషన్ ప్రక్రియ వేగవంతమైందని ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. జూన్ 2024 నుంచి ఇప్పటివరకు 22ఏ జాబితా నుంచి తప్పించాలని కోరుతూ దాఖలైన దరఖాస్తులు 6,846 అని వెల్లడించింది. కాగా ఎక్స్ సర్వీస్‌మెన్, రాజకీయ బాధితులు, స్వాతంత్ర్య సమరయోధులు, 1954 కంటే ముందు అసైన్డ్ భూములు కలిగిన వాళ్ల భూములను 22ఏ నుంచి తొలిగించినట్లు వెల్లడించింది. 6,693 గ్రామాల్లో రీసర్వే పూర్తి అయిందని.. వెబ్ ల్యాండ్ 2.0లో వివరాలు నమోదు చేశారని పేర్కొంది. కాగా, రీసర్వేలో ఎలాంటి తప్పులు, పొరపాట్లు జరగకుండా భూమి రికార్డుల అప్‌గ్రెడేషన్ చేసినట్లు చెప్పింది.
ఈ సందర్భంగా రాష్ట్రంలో రెవెన్యూ సేవలను సులభతరం చేయాలని సంబంధిత శాఖ ఉన్నాతాధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. రియల్ టైమ్‌లో ఆటోమ్యుటేషన్ పూర్తి కావాలని ఆదేశించారు. పట్టదార్ పాస్ పుస్తం కోసం భూముల యజమానులు ఆఫీసులకు చుట్టూ తిరగకూడదని సూచించారు. ఈ మేరకు రెవెన్యూ శాఖలో ప్రక్షాళన జరగాలని చంద్రబాబు ఆదేశించారు. ఇక ఆదేశాల అమలుపై ప్రతి నెల రెవెన్యూ శాఖపై సమీక్ష చేస్తానని సీఎం చెప్పారు. కాగా, భూ వివాద రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను మార్చాలనేదే ప్రభుత్వ లక్ష్యమని.. అందుకోసం ప్రయత్నిస్తున్నట్లు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిచేస్తున్నామని.. రాష్ట్రంలో జీరో ఎర్రర్ రెవెన్యూ వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఇక భూ సమస్యలకు ఇకపై జాయింట్ కలక్టర్లే బాధ్యులు అని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa