కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలోని పురాతన ఆలయంలోని పూజారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పెరుగుతున్న విడాకుల కేసుల కారణంగా ఇప్పటి నుంచి ఈ ఆలయంలో పెళ్లి వేడుకలను నిర్వహించడం ఆపివేస్తున్నట్లు ప్రకటించారు. అక్కడ పెళ్లి చేసుకున్న జంటలు.. విడాకుల కోసం కోర్టులకు వెళ్తే.. పూజారులను కూడా విచారణకు పిలుస్తున్నారు. దీంతో పెళ్లిళ్లు చేయించడం కంటే పూజారులు కోర్టుల్లోనే ఎక్కువ సమయం గడపాల్సిన పరిస్థితి ఏర్పడటం.. పారిపోయి వచ్చిన జంటలు ఫేక్ సర్టిఫికెట్లు సమర్పించడం వంటి సమస్యల వల్ల ఆలయ ప్రతిష్ట దెబ్బతింటోందని అర్చకులు పేర్కొంటున్నారు. ఆలయం పేరును కాపాడుకోవడానికి.. చట్టపరమైన చిక్కులను నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
చోళుల కాలం నాటి 12వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ హలసూరు సోమేశ్వర స్వామి ఆలయం.. పెళ్లిళ్లకు వేదికగా ఉన్న శతాబ్దాల సంప్రదాయాన్ని నిలిపివేయడం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. పెళ్లిళ్లను తామే జరిపి.. వాటికి సాక్షులుగా ఉండే పూజారులు.. పెరిగిన విడాకుల కేసుల కారణంగా నిత్యం కోర్టుల చుట్టూ తిరగాల్సి రావడంతో ఆలయ నిర్వహణ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. గత రెండేళ్లలో 50కి పైగా విడాకులకు సంబంధించిన ఫిర్యాదులు రావడంతో.. ఆలయ ప్రతిష్టకు భంగం కలగకుండా ఉండేందుకు.. అక్రమ వివాహాలు, నకిలీ పత్రాల సమర్పణను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అయితే భవిష్యత్తులో ఈ విధానాన్ని సమీక్షించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఈ హలసూరు సోమేశ్వర స్వామి ఆలయం.. వేల సంఖ్యలో పెళ్లిళ్లకు వేదికగా నిలిచింది. కానీ గత 6, 7 ఏళ్లుగా ఈ సంప్రదాయం ఆగిపోయింది. ఆ ఆలయ పూజారులు.. వివాహాలను దగ్గరుండి జరిపించి.. సాక్షులుగా విడాకుల కేసుల్లో తరచూ కోర్టు విచారణలకు హాజరు కావాల్సి వస్తోంది. దీంతో వారు ఆలయ ఆచారాలు, నిత్య పూజల కంటే కోర్టుల చుట్టే ఎక్కువ సమయం తిరగాల్సి వస్తోంది.
ఆలయ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. దశాబ్ద కాలం క్రితం సంవత్సరానికి 5 కంటే తక్కువగా ఉన్న విడాకులకు సంబంధించిన ఫిర్యాదులు.. గత రెండేళ్లలోనే 50కి పైగా నమోదయ్యాయని.. ఆలయ నిర్వహణ కమిటీ ముఖ్య పరిపాలనా అధికారి వి. గోవిందరాజు వెల్లడించారు. చాలా మంది జంటలు ఇళ్ల నుంచి పారిపోయి వచ్చి పెళ్లిళ్లు చేసుకోవడానికి నకిలీ పత్రాలను సమర్పిస్తున్నారని పేర్కొన్నారు. కొద్ది రోజుల తర్వాత.. వారి తల్లిదండ్రులు వచ్చి, కొన్ని సందర్భాల్లో కోర్టు కేసులు ఫైల్ చేస్తున్నారని ఆయన తెలిపారు.
ఇలాంటి ఘటనలు ఆలయ ప్రతిష్టను దెబ్బతీసే అవకాశం ఉందని భావించి.. పెరుగుతున్న చట్టపరమైన చిక్కులను నివారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ అధికారులు స్పష్టం చేశారు. ఈ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా తెలియజేశారు. ఈ నిర్ణయంపై భక్తులు, ప్రజల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది. ఆలయ పవిత్రతను కాపాడటానికి, పూజారుల సమయాన్ని దైవారాధనకు వినియోగించడానికి తీసుకున్న ఈ నిర్ణయాన్ని కొందరు భక్తులు అభినందించారు. మరికొందరు మాత్రం.. ఈ నిర్ణయం సాంస్కృతిక ఆచారాలను దెబ్బతీసేదిగా అభిప్రాయపడ్డారు.
ఈ ఆలయం ఇతర ఆచారాలు, మతపరమైన వేడుకలను కొనసాగిస్తున్నప్పటికీ.. పెళ్లిళ్లను తాత్కాలికంగా నిలిపివేసిందని సుప్రీంకోర్టు లాయర్ అమిష్ అగర్వాలా తెలిపారు. ఈ నిర్ణయం ఆధారంగా భవిష్యత్తులో వచ్చే సమస్యలను దృష్టిలో పెట్టుకుని.. ఈ విధానాన్ని సమీక్షించే అవకాశం ఉందని ఆలయ నిర్వహణ సూచించింది. దక్షిణ భారతదేశంలో ఆలయ వివాహాలు పవిత్రంగా పరిగణించబడతాయని.. అయితే చట్టపరమైన చిక్కులు పెరుగుతున్నందున సోమేశ్వరాలయం ఈ వివాహాలకు అడ్డు చెప్పక తప్పలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa