ట్రెండింగ్
Epaper    English    தமிழ்

11 ఏళ్ల కాపురానికి ఫుల్‌స్టాప్ పెట్టిన అహ్మదాబాద్ దంపతులు

national |  Suryaa Desk  | Published : Tue, Dec 09, 2025, 08:31 PM

భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు జరగడం సహజమే. ముఖ్యంగా తినే దగ్గర, పడుకునే దగ్గర, సినిమాలు చూసే దగ్గర దంపతుల మధ్య చిన్నపాటి బేధాభిప్రాయాలు ఉంటుంటాయి. వీటిని అర్థం చేసుకుని.. ఒక్కోసారి ఒక్కొక్కొరికి నచ్చినట్లుగా నడుచుకుంటే సరిపోయే ఈ సమస్యకే ఓ జంట విడాకులు తీసుకుంది. ముఖ్యంగా 11 ఏళ్ల పెళ్లి బంధానికి బైబై చెప్పేసింది. అదికూడా వంటగదిలోని ఉల్లిపాయ, వెల్లుల్లి వాడకంపై గొడవ రావడం.. దేశ ప్రజలందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.


అసలేం జరిగిందంటే?


అహ్మదాబాద్‌కు చెందిన ఓ అమ్మాయి, అబ్బాయి 2002లో వివాహం చేసుకున్నారు. అయితే భార్య స్వామినారాయణ సంప్రదాయానికి చెందిన భక్తురాలు కావడంతో.. ఆమె మతపరమైన ఆచారాలలో భాగంగా ఉల్లిపాయ, వెల్లుల్లిని తినేది కాదు. ఇంట్లో కూడా వాడకూడదని చెప్పేది. అయితే ఆమె భర్త, అత్తగారు మాత్రం వాటిని తినేవారు. మొదట్లో ఈ ఆహారపు అలవాట్ల తేడాలు పెద్ద సమస్యగా అనిపించకపోయినా.. కాలక్రమేణా వీటి వల్లే కుటుంబ సభ్యుల మధ్య దూరం పెరిగింది. ముఖ్యంగా ఇంట్లో వేర్వేరు వంట ఏర్పాట్లు చేసుకోవడం పరిపాటిగా మారింది. దీనివల్ల కుటుంబంలో ఉద్రిక్తత పెరిగింది. రోజురోజుకూ ఈ గొడవల మరింత పెరిగాయి.


ఈ కుటుంబ కలహాలు తీవ్రం కావడంతో భార్య.. బిడ్డతో సహా పుట్టింటికి వెళ్లిపోయింది. 2013లో భర్త అహ్మదాబాద్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించి.. ఆహారపు అలవాట్ల విషయంలో భార్య రాజీ పడకపోవడం క్రూరత్వంతో సమానం అని, ఇది తమను విడిపోయేలా చేసిందని ఆరోపిస్తూ విడాకులు కోరారు. 2024లో ఫ్యామిలీ కోర్టు విడాకులను మంజూరు చేసి, భర్త భార్యకు భరణం చెల్లించాలని ఆదేశించింది. కానీ ఫ్యామిలీ కోర్టు తీర్పును సవాలు చేస్తూ.. భార్య గుజరాత్ హైకోర్టును ఆశ్రయించింది. ఆమె తరఫు న్యాయవాది.. మతపరమైన ఆహార నియమాల ప్రభావాన్ని భర్త అతిగా చూపుతున్నారని వాదించారు.


కానీ భర్త మాత్రం ఉల్లి, వెల్లుల్లి వినియోగం నిరంతర ఘర్షణకు మూలమైందని భర్త తెలిపారు. ఉల్లి, వెల్లుల్లి లేకుండా వంట చేయడానికి అత్తగారు ప్రయత్నించినా గొడవలు ఆగలేదని.. ఒకసారి ఉద్రిక్తతల కారణంగా భార్య మహిళా పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఇలాంటి సమస్యలతో జీవితాంతం బతకలేనని కూడా చెప్పారు. దీంతో భార్య కూడా తనకు విడాకులు కావాలని చెప్పారు. దీంతో భర్త కూడా ఆమెకు చెల్లించాల్సిన భరణం మొత్తాన్ని కోర్టులో వాయిదాల పద్ధతిలో జమ చేయడానికి ఒప్పుకున్నారు. దీంతో ఉభయ సమ్మతి ఏర్పడడంతో.. హైకోర్టు భార్య పిటిషన్‌ను కొట్టివేసి, ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన విడాకులను సమర్థించింది. ఇంత చిన్న గొడవకే 11 ఏళ్ల బంధం చిన్నాభిన్నం కావడం చూసి ప్రజలంతా షాక్ అవుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa