అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ నుంచి దిగుమతులపై 50 శాతం వరకు సుంకాలు విధించిన నిర్ణయం యూఎస్ కాంగ్రెస్‌లో గట్టి వ్యతిరేకతకు దారితీసింది. ఈ సుంకాలను చట్టవిరుద్ధమని, అమెరికా కార్మికులు, వినియోగదారులకు నష్టకరమని ఆరోపిస్తూ ప్రతినిధుల సభలో ముగ్గురు సభ్యులు తీర్మానం ప్రవేశపెట్టారు. డెబోరా రాస్, మార్క్ వీసీ, రాజా కృష్ణమూర్తి ఈ తీర్మానానికి నాయకత్వం వహిస్తున్నారు. ఈ చర్య భారత్‌తో అమెరికా సంబంధాలను దెబ్బతీస్తుందని, సరఫరా గొలుసులను భంగపరుస్తుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ తీర్మానం ట్రంప్ ప్రకటించిన జాతీయ అత్యవసర పరిస్థితిని రద్దు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఆగస్టు 27, 2025న అదనంగా 25 శాతం సెకండరీ సుంకాలు విధించడంతో మొత్తం 50 శాతం సుంకాలు అమల్లోకి వచ్చాయి. ఈ చర్యలు అమెరికా రాజ్యాంగంలో కాంగ్రెస్‌కు ఉన్న వాణిజ్య అధికారాలను ఉల్లంఘించినవని డెమోక్రాటిక్ సభ్యులు ఆరోపిస్తున్నారు. భారత్ ముఖ్యమైన ఆర్థిక, వ్యూహాత్మక భాగస్వామి అని నొక్కి చెబుతూ, ఈ సుంకాలు రద్దు చేస్తే రెండు దేశాల సహకారం మరింత బలోపేతమవుతుందని వారు వాదిస్తున్నారు.
అక్టోబర్‌లోనే రో ఖన్నా సహా 19 మంది సభ్యులతో కలిసి ఈ ముగ్గురు ట్రంప్‌ను సుంకాలు ఉపసంహరించాలని కోరారు. ఇప్పుడు ప్రవేశపెట్టిన తీర్మానం బ్రెజిల్‌పై సుంకాలను రద్దు చేసిన సెనెట్ చర్యను అనుసరిస్తోంది. భారత్ కంపెనీలు అమెరికాలో బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టి వేలాది ఉద్యోగాలు సృష్టిస్తున్న నేపథ్యంలో ఈ సుంకాలు అమెరికా ఆర్థిక వ్యవస్థకే నష్టకరమని డెబోరా రాస్ అభిప్రాయపడ్డారు. మార్క్ వీసీ ఇవి సాధారణ అమెరికన్లపై పన్నుగా మారుతున్నాయని ధ్వజమెత్తారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ పరిణామాలు ట్రంప్ విధానాలకు గట్టి ఎదురుదెబ్బలాగా మారాయి. పుతిన్-మోదీ భేటీలు అమెరికాలో కలవరం రేకెత్తిస్తున్న నేపథ్యంలో ఈ వ్యతిరేకత మరింత పెరిగింది. భారత్-అమెరికా సంబంధాలు బలోపేతం కావాలంటే సుంకాలు తొలగించడం అనివార్యమని విశ్లేషకులు అంటున్నారు. ఈ తీర్మానం ఆమోదం పొందితే రెండు దేశాల వాణిజ్య సంబంధాలు మళ్లీ సాఫీగా సాగే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa