ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి అని దీవించే సమాజంలో.. అదే బిడ్డ అత్తారింటికి వెళ్ళిన తర్వాత కట్నం కోసం కాటికి పంపబడుతుండటం మన నాగరికతకు మాయని మచ్చ. కట్టుకున్నవాడు కొండంత అండగా ఉంటాడని నమ్మిన ప్రాణాలు.. అదనపు ఆశల వేటలో అర్ధాంతరంగా గాలిలో కలిసిపోతున్నాయి. హైదరాబాద్ లాంటి మహానగరంలో విద్యావంతులు, ఐటీ నిపుణులు ఎక్కువగా ఉన్నచోట కూడా ఈ కట్న దాహం తగ్గకపోవడం శోచనీయం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గత 11 నెలల కాలంలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన లెక్కల ప్రకారం దాదాపు 16 మంది మహిళలు వరకట్న వేధింపుల కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇందులో కేవలం హత్యలే కాకుండా.. వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి.
పెళ్లైన ఒకటి నుంచి మూడేళ్ల లోపే ఈ మరణాలు సంభవించడం గమనార్హం. అంటే.. కాళ్ల పారాణి ఆరకముందే ఆ ఇళ్లలో చిచ్చు రేగుతోంది. ఐటీ కారిడార్ అని పిలుచుకునే గచ్చిబౌలి, మాదాపూర్ నుంచి పాతబస్తీ వరకు అన్ని ప్రాంతాల్లోనూ ఇలాంటి అమానవీయ ఘటనలు చోటుచేసుకున్నాయి. వరకట్న వేధింపులు డబ్బుకు సంబంధించినవి మాత్రమే కావు.. అవి ఒక రకమైన మానసిక వేదన. పెళ్లి సమయంలో ఒప్పందం ప్రకారం కట్నం ఇచ్చినప్పటికీ.. పెళ్లైన కొద్ది రోజులకే వ్యాపారం కోసమనో, ఇల్లు కొనడానికో అదనపు డబ్బు తేవాలని ఒత్తిడి చేయడం మొదలవుతుంది. పక్కింటి వారికి ఎంత కట్నం వచ్చింది.. మా వాడికి ఎంత వచ్చింది అనే పోలికలు అత్తారింటి వేధింపులకు ఆజ్యం పోస్తున్నాయి.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, ఉన్నత ఉద్యోగాలు చేసే వారు కూడా విదేశాలకు వెళ్లడానికో లేదా విలాసవంతమైన కార్ల కోసమో భార్యలను వేధిస్తున్నారు. వరకట్న నిషేధ చట్టం (1961) , భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 498-ఏ వంటి కఠినమైన చట్టాలు ఉన్నప్పటికీ.. నేరాలు తగ్గకపోవడానికి ప్రధాన కారణం సామాజిక భయం. చాలా మంది మహిళలకు తమకు ఉన్న చట్టపరమైన హక్కులపై పూర్తి అవగాహన ఉండటం లేదు. ఏదైనా చిన్న సమస్య వస్తే పెద్దలు కూర్చుని రాజీ కుదర్చాలని ప్రయత్నిస్తారు. కానీ అది కొన్నిసార్లు లబ్ధిదారులను మరింత ప్రమాదంలోకి నెడుతోంది. గది నాలుగు గోడల మధ్య జరిగే వేధింపులకు సాక్ష్యాలు దొరకడం కష్టమవుతుండటంతో నిందితులు సులభంగా తప్పించుకుంటున్నారు.
ఈ సమస్యను చట్టాలతోనే పరిష్కరించలేం. సమాజంలో మూలాల నుంచి మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఆడపిల్లలకు కేవలం పెళ్లి చేయడం కంటే.. వారికి చదువు, ఉద్యోగం కల్పించి ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయాలి. అబ్బాయిలకు మహిళలను గౌరవించడం నేర్పాలి. పెళ్లి అంటే కేవలం ఆస్తి బదిలీ కాదు.. ఇద్దరు వ్యక్తుల కలయిక అని అర్థమయ్యేలా పెంచాలి.
వేధింపులు శృతిమించుతున్నాయని అనిపించినప్పుడు వెంటనే తల్లిదండ్రులకు చెప్పడం లేదా షీ టీమ్స్ సాయం తీసుకోవడం ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు. వరకట్న చావులకు కారణమైన వారికి కోర్టులు త్వరితగతిన కఠిన శిక్షలు విధిస్తే అది సమాజంలో ఒక హెచ్చరికగా మారుతుంది. హైదరాబాద్ లాంటి మహానగరంలో మన ఆడబిడ్డల ప్రాణాలు గాలిలో కలవకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలి. వరకట్నం తీసుకోవడం, ఇవ్వడం రెండూ నేరమే అనే స్పృహ అందరిలో కలగాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa