77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ విజయవాడలోని లోక్ భవన్లో 'ఎట్ హోమ్' కార్యక్రమాన్ని సోమవారం సాయంత్రం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సాంప్రదాయ తేనీటి విందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ తదితరులు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రాజ్యాంగ అధిపతులు, పరిపాలన, న్యాయవ్యవస్థకు చెందిన ప్రముఖులు ఒకేచోట చేరడంతో ఈ కార్యక్రమం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ఆయన అర్ధాంగి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమం ప్రారంభంలో పోలీస్ బ్యాండ్ బృందం జాతీయ గీతాన్ని ఆలపించగా, ఆహూతులందరూ గౌరవ వందనం సమర్పించారు. ఈ వేడుకలో శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, పలువురు రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.అనంతరం గవర్నర్, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వేదికపై నుంచి కిందకు వచ్చి ఇతర అతిథులతో కలిసిపోయారు. స్వాతంత్య్ర సమరయోధులతో ప్రత్యేకంగా ముచ్చటిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, పద్మ పురస్కార గ్రహీతలు, కళాకారులు, క్రీడాకారులతో ఆత్మీయంగా పలకరించారు. నేతల మధ్య సరదా సంభాషణలతో లోక్ భవన్ ప్రాంగణమంతా ఆహ్లాదకర వాతావరణం నెలకొంది.ఈ సందర్భంగా లోక్ భవన్‌ను విద్యుత్ దీపాల అలంకరణలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న అధిపతులంతా ఒకేచోట చేరిన ఈ కార్యక్రమం, రాష్ట్రంలో పరిపాలన సామరస్యాన్ని ప్రతిబింబించింది. గత ఏడాది కాలంలో రాష్ట్రం సాధించిన ప్రగతి, గణతంత్ర స్ఫూర్తి గురించి పలువురు ప్రముఖులు ఈ సందర్భంగా స్మరించుకున్నారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ 'ఎట్ హోమ్' కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa