ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అందుబాటులోకి కొత్త ఆర్వోబీ.. మరో రెండురోజుల్లో

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 13, 2026, 08:21 PM

వాహనదారులకు ముఖ్య గమనిక. ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా మరికొన్ని రోజులలో కొత్త రైల్వే ఓవర్ బ్రిడ్జి అందుబాటులోకి రానుంది. విశాఖపట్నంలో వాహనదారుల ట్రాఫిక్ సమస్యలకు ముగింపు పలికేలా ఎన్ఏడీ జంక్షన్ - కాకానిగర్ మధ్యలో రైల్వే ఓవర్ బ్రిడ్జి అందుబాటులోకి రానుంది. ఈ ఆర్వోబీ పనులు సుమారుగా పూర్తి అయ్యాయి. ఫిబ్రవరి 15వ తేదీన ఈ ఆర్వోబీని అధికారికంగా ప్రారంభించనున్నారు. నిర్మాణ పనులు పూర్తి కాగా.. వంతెనకు తుదిమెరుగులు దిద్దుతున్నారు. ఆర్వోబీకి ఇరువైపులా బీటీరోడ్డు, కాంక్రీటు పనులు పూర్తయ్యాయి. ఆర్వోబీ ప్రారంభోత్సవానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.


మరోవైపు కేంద్రం సహకారంతో ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులు. జాతీయ రహదారుల నిర్మాణం వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే విశాఖలో కీలకమైన ఆర్వోబీ నిర్మాణం పూర్తి చేసింది. ఎన్ఏడీ జంక్షన్ - కాకానినగర్ ఆర్వోబీ నిర్మాణాన్ని రెండు సంవత్సరాల కిందటే పూర్తి చేయాల్సి ఉంది. అయితే అనుమతుల జారీలో జాప్యంతో కొంచెం ఆలస్యం అయ్యింది. ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జిని18 మీటర్ల ఎత్తులో రైలు పట్టాలపై నిర్మించారు. 210 మీటర్ల పొడవు ఉండనుంది. ఆర్వోబీకి రెండు వైపులా అప్రోచ్ రోడ్లు ఉంటాయి.


మరోవైపు విశాఖపట్నంలో ఎన్ఏడీ జంక్షన్ చేరుకోవడం ఒక ఎత్తు అయితే.. అక్కడి నుంచి విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకోవటం మరింత ఇబ్బంది. ఈ నేపథ్యంలో ఎన్ఏడీ జంక్షన్ నుంచి కాకానినగర్ చేరుకునేలా ఈ ఆర్వోబీ నిర్మిస్తున్నారు. మరోవైపు రైల్వేఓవర్ బ్రిడ్జితో పాటుగా సర్వీస్ రోడ్లు కూడా అందుబాటులోకి వస్తే మొత్తం ఆరు రోడ్లు వాహనదారులకు అందుబాటులోకి వస్తాయి. దీంతో ఆర్వోబీ పైనుంచి, అలాగే కింది నుంచి వాహనాల రాకపోకలకు వీలవుతుంది.


విశాఖపట్నం ఏపీ ఆర్థిక రాజధానిగా రూపాంతరం చెందుతోంది. పలు ఐటీ కంపెనీలు, అంతర్జాతీయ సంస్థలు విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. దీంతో విశాఖ పారిశ్రామికంగా అభివృద్ధి చెందడమే కాకుండా నగరం కూడా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో నగరం భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా రహదారి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించింది. వాహనదారులకు ట్రాఫిక్ ఫ్రీ జర్నీ అందించేలా చర్యలు తీసుకుంటోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa