ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మళ్లీ అంత్యక్రియలు.....ఆయేషా మీరా హత్య కేసులో సీబీఐ కోర్టు కీలక ఆదేశాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 20, 2026, 11:18 PM

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన ఆయేషా మీరా హత్య కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఆయేషా మీరా కేసులో వైద్య బృందం సేకరించిన అవశేషాలను.. ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించాలని సీబీఐ కోర్టు అధికారులను ఆదేశించింది. ఆయేషా మీరా మృతదేహం అవశేషాలకు వారి మతపరమైన ఆచారాల ప్రకారం ఫిబ్రవరి 27న తెనాలిలో అంత్యక్రియలు నిర్వహించాలని సీబీఐ కోర్టు సూచించింది. ఇందుకు అవసరమైన వసతులతో పాటుగా, భద్రత కల్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని సీబీఐ కోర్టు ఆదేశించింది. ఈ మొత్తం ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేయాలని.. ప్రభుత్వ అధికారుల సమక్షంలో ఇదంతా జరగాలంటూ సీబీఐ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.


మరోవైపు ఆయేషా మీరా హత్య కేసును దర్యాప్తు చేసిన సీబీఐ అధికారులు.. దర్యాప్తులో భాగంగా ఆమె మృతదేహానికి రెండోసారి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం అవశేషాలను సీబీఐ కోర్టు ఎదుట ఉంచారు. అయితే తమ కుమార్తె శరీర అవశేషాలను తమకు అప్పగించాలని కోరుతూ ఆయేషా మీరా తల్లిదండ్రులు సీబీఐ కోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్ విచారించిన సీబీఐ కోర్టు.. వారి విజ్ఞప్తిని అంగీకరించి, ఆయేషా మీరా శరీర అవశేషాలను అప్పగించాలంటూ విజయవాడలోని సీబీఐ కోర్టు ఆదేశాలిచ్చింది.


2007లో ఆయేషా మీరా హత్యకు గురైంది. బీఫార్మసీ చదువుతున్న ఆయేషా మీరాను ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలో హత్య చేశారు. ఓ మహిళల వసతి గృహంలో ఈ హత్య చోటుచేసుకుంది. ఈ కేసుపై సీబీఐ ఎనిమిదేళ్లు దర్యాప్తు జరిపింది. విచారణ సందర్భంగా సీబీఐ కోర్టులో ఆయేషా మీరా తల్లిదండ్రులు ఇటీవల కన్నీళ్లు పెట్టుకున్నారు. తమ కూతురి హత్య కేసుపై 18 ఏళ్లుగా పోరాడుతున్నా తమకు మాత్రం న్యాయం జరగటం లేదని అన్నారు. మరోవైపు ప్రొటెస్ట్ పిటిషన్ వేయడానికి ఆయేషా మీరా తల్లిదండ్రులు అంగీకరించలేదు. తాము ఇంక పోరాటం చేయలేమని.. తమకంత ఆర్థిక స్థోమత కూడా లేదని విచారణ సందర్బంగా కోర్టుకు తెలియజేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa