జోధ్‌పూర్ సీఏజడ్‌ఆర్‌ఐలో ఏపీ మీడియా బృందానికి అబ్బురపరిచిన వ్యవసాయ పరిశోధనలు
ఎడారి నేలపై.. పచ్చని విప్లవం !
- జోధ్‌పూర్ సీఏజడ్‌ఆర్‌ఐలో ఏపీ మీడియా బృందానికి అబ్బురపరిచిన వ్యవసాయ పరిశోధనలు
- చుక్క నీటితో చక్కని దిగుబడి
- పంటతోపాటు విద్యుత్.. అదనపు ఆదాయం
- ముల్లులేని కాక్టస్‌తో మేతకు భరోసా
-130 రకాల వృక్షజాతులతో అగ్రి ఎకో పార్క్
జోధ్‌పూర్, సూర్య ప్రతినిధి
నీరు తక్కువ.. ఎండలు ఎక్కువ.. అయినా వ్యవసాయానికి ఢోకా లేదని రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ సెంట్రల్ అరిడ్ జోన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఏజడ్‌ఆర్‌ఐ) పరిశోధనలు చాటుతున్నాయి. తక్కువ నీటితో పంటలు పండించడం, వర్షపు నీటిని సంరక్షించడం, పశుగ్రాసాన్ని అభివృద్ధి చేయడం, వ్యవసాయంతో విద్యుత్ ఉత్పత్తి చేయడం, పంటలకు విలువ జోడించడం వంటి అనేక అంశాలపై ఇక్కడ విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ పరిశోధనలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రతినిధుల బృందం మంగళవారం సీఏజడ్‌ఆర్‌ఐని సందర్శించింది.
చుక్క నీటితో...చక్కని దిగుబడి
ఎడారి, వర్షాభావ ప్రాంతాల్లో నీటి కొరతను అధిగమించి వ్యవసాయం చేసే విధానాలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి నిల్వ చేయడం, అవసరమైనప్పుడు వినియోగించడం, నీటిని తిరిగి ఉపయోగించడం వంటి పద్ధతులను అమలు చేస్తున్నారు. రూఫ్ వాటర్ హార్వెస్టింగ్, నేలలో తేమను కాపాడే విధానాలను రైతులకు పరిచయం చేస్తున్నారు. తక్కువ నీటితో సాగయ్యే పంటల ద్వారా రైతులకు మెరుగైన దిగుబడులు, ఆదాయం వచ్చేలా పరిశోధనలు కొనసాగుతున్నాయి.
400 ఎకరాల్లో రైతు భవితకు బాటలు
కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) విజయవాడ నిర్వహిస్తున్న రాజస్థాన్ పర్యటనలో భాగంగా మీడియా బృందం సీఏజడ్‌ఆర్‌ఐని సందర్శించింది. సుమారు 400 ఎకరాల్లో విస్తరించిన పరిశోధన క్షేత్రాలను ప్రతినిధులు పరిశీలించారు. పంటలు, నేల సంరక్షణ, ఉద్యాన పంటలు, అగ్రోఫారెస్ట్రీ, నీటి సంరక్షణ తదితర అంశాలపై జరుగుతున్న ప్రయోగాలను శాస్త్రవేత్తలు వివరించారు. 1959లో ఏర్పాటైన ఈ సంస్థ భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) ఆధ్వర్యంలో పనిచేస్తోంది.
పంటతోపాటు విద్యుత్.. అదనపు ఆదాయం
వ్యవసాయ భూమిలో పంటల సాగుతోపాటు సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే అగ్రి వోల్టాయిక్ విధానాన్ని ఇక్కడ ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఎకరా విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన నమూనా యూనిట్‌ను మీడియా బృందం పరిశీలించింది. ఒకే భూమి నుంచి పంట దిగుబడితోపాటు విద్యుత్ ఉత్పత్తి ద్వారా అదనపు ఆదాయం పొందే అవకాశాలను ఈ విధానం చూపిస్తోంది.పంటలను నేరుగా విక్రయించకుండా వాటికి విలువ జోడించి అధిక ఆదాయం పొందే విధానాలపైనా పరిశోధనలు జరుగుతున్నాయి. సంస్థలోని పోస్ట్ హార్వెస్ట్ ప్రయోగశాలలో బిస్కెట్లు, కుకీలు, చాక్లెట్లు వంటి ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. రైతులు, వ్యవసాయ పారిశ్రామికవేత్తలకు విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై శిక్షణ ఇచ్చే అవకాశం కల్పిస్తున్నారు.
ముల్లులేని కాక్టస్‌తో మేతకు భరోసా
నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో సులభంగా పెరిగే ముల్లులేని కాక్టస్‌పై ప్రత్యేక పరిశోధనలు చేస్తున్నారు. తక్కువ నీటితో పెరిగే ఈ పంటను పశుగ్రాసంగా ఉపయోగించే అవకాశాలను పరిశీలిస్తున్నారు. నేపియర్ హైబ్రిడ్ వంటి పశుగ్రాస పంటలను కూడా సాగు చేస్తూ ఎండాకాలంలో పశువులకు మేత కొరత లేకుండా చేసే పద్ధతులను అభివృద్ధి చేస్తున్నారు.
130 రకాల వృక్షజాతులతో అగ్రి ఎకో పార్క్
సీఏజడ్‌ఆర్‌ఐలో ఏర్పాటు చేసిన అగ్రి ఎకో టూరిజం పార్క్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సుమారు 8 హెక్టార్లలో 32 విభాగాలుగా ఏర్పాటు చేసిన ఈ పార్కులో 130 రకాల మొక్కలు, శుష్క ప్రాంతాలకు అనువైన వృక్షజాతులను పెంచుతున్నారు. వివిధ రకాల నేల నమూనాలను ప్రదర్శించే ప్రత్యేక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఎడారి ప్రాంతాల్లో పచ్చదనం పెంపుతోపాటు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేలా ఈ పార్కును అభివృద్ధి చేశారు.
ఏటా లక్షకు పైగా మొక్కల ఉత్పత్తి
సంస్థకు చెందిన నర్సరీలో ఏటా సుమారు 1.15 లక్షల పండ్ల మొక్కలు, అగ్రోఫారెస్ట్రీ మొక్కలను ఉత్పత్తి చేస్తున్నారు. ఎండ ప్రాంతాలకు అనువైన మొక్కలను రైతులకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. శుష్క ప్రాంతాల్లో రైతులకు నాణ్యమైన నాటుసామగ్రి అందించడంతోపాటు మొక్కల పెంపకంపై అవగాహన కల్పిస్తున్నారు.
శాస్త్రవేత్తలతో మీడియా బృందం ముఖాముఖి
సీఏజడ్‌ఆర్‌ఐ యాక్టింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎస్.పీ.ఎస్. తన్వార్ వ్యవసాయ పద్ధతులు, నేల సంరక్షణ, ఉద్యాన పంటలు, అగ్రోఫారెస్ట్రీ, నీటి సంరక్షణ, విలువ ఆధారిత ఉత్పత్తులపై మీడియా ప్రతినిధులకు వివరించారు.
