2027 ఎన్నికలే లక్ష్యం

షేర్ చేయండి:

ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో పూర్వ వైభవాన్ని సంతరించుకునే దిశగా బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి తన వ్యూహాలకు పదును పెట్టారు. 2027 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా, గతంలో 2007లో తనకు చారిత్రక విజయాన్ని అందించిన "దళిత-బ్రాహ్మణ" సామాజిక సమీకరణాన్ని ఆమె తిరిగి తెరపైకి తెస్తున్నారు. వరుస ఓటములతో కుదేలైన పార్టీని గట్టెక్కించేందుకు ఈ పాత ఫార్ములానే సరైన మార్గమని ఆమె విశ్వసిస్తున్నారు.

ఈ వ్యూహంలో భాగంగా, పార్టీలో కీలక నేత, తన అత్యంత సన్నిహితుడైన సతీశ్ చంద్ర మిశ్రాకు మాయావతి అదనపు బాధ్యతలు అప్పగించారు. బీఎస్పీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న ఆయన, ఇకపై పార్టీకి సంబంధించిన లీగల్, మీడియా విభాగాలకు కూడా నేతృత్వం వహించనున్నారు. అలాగే, కేంద్రం ఎన్నికల సంఘానికి సంబంధించిన వ్యవహారాలను సైతం ఆయనే పర్యవేక్షిస్తారని మాయావతి ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో మిశ్రా పాత్ర అత్యంత కీలకం కానుందని ఆమె స్పష్టం చేశారు.

దీనికి తోడు, 2027 ఎన్నికల బరిలో నిలిపే బ్రాహ్మణులతో పాటు ఇతర అగ్రవర్ణాల అభ్యర్థులను బీఎస్పీ ఇప్పటి నుంచే ఖరారు చేయడం ప్రారంభించింది. తమ తాజా వ్యూహాలతో ప్రత్యర్థి పార్టీలలో కలవరం మొదలైందని మాయావతి వ్యాఖ్యానించారు. 2007 నాటి "సర్వజన్" (అన్ని వర్గాల హితం) నినాదాన్ని పునరావృతం చేస్తూ, ఈసారి కూడా అగ్రవర్ణాలకు ప్రాధాన్యతనిస్తూ మరిన్ని సీట్లు కేటాయిస్తామని ఆమె హామీ ఇచ్చారు.

గతంలో 2007లో "హాథీ నహీ గణేశ్ హై.. బ్రహ్మ, విష్ణు, మహేశ్ హై" అనే వినూత్న నినాదంతో బీఎస్పీ 206 స్థానాలను కైవసం చేసుకుని, 30 శాతం ఓట్ షేర్‌తో అధికార పీఠాన్ని అధిష్టించింది. అయితే, ఆ తదుపరి ఎన్నికల్లో పార్టీ ప్రాబల్యం క్రమంగా క్షీణిస్తూ వచ్చింది. 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒకే ఒక స్థానానికి, 2024 లోక్‌సభ ఎన్నికల్లో సున్నా స్థానాలకు పార్టీ పరిమితమైంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని సుమారు 10 శాతం బ్రాహ్మణ ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపుతుండగా, మాయావతి అనుసరిస్తున్న ఈ పాత ఫార్ములా ఆమెకు మళ్లీ పూర్వ వైభవాన్ని తెచ్చిపెడుతుందా అనేది వేచి చూడాలి.