బ్యాంకులే రైతుల వద్దకు వెళ్లాలి

షేర్ చేయండి:

బ్యాంకులే రైతుల వద్దకు వెళ్లాలి
ప్రతి రైతుకూ సకాలంలో రుణం అందాలి
రుణంతో పాటు రైతు ఆదాయమూ పెరగాలి
క్యూర్, ప్యూర్, రేర్ అనుగుణంగా బ్యాంకింగ్ వ్యూహాలు

ఎస్ఎల్బీసీ స‌మావేశంలో ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క


తెలంగాణను 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంలో బ్యాంకింగ్, ఆర్థిక రంగం కీలక భాగస్వాములుగా మారాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. కేవలం ప్రభుత్వ వ్యయంతో ఈ లక్ష్యాన్ని సాధించడం సాధ్యం కాదని, భారీ స్థాయిలో ప్రైవేట్ పెట్టుబడులు, బలమైన ఆర్థిక సంస్థలు, లోతైన ఆర్థిక మార్కెట్లు, వినూత్న నిధుల విధానాలు అవసరమని స్పష్టం చేశారు. మ‌హాత్మా జ్యోతిరావు ఫూలే ప్ర‌జాభ‌వ‌న్ లో జ‌రిగిన 50వ రాష్ట్ర స్థాయి బ్యాంక‌ర్ల స‌మావేశంలో ఆయ‌న పాల్గొని ప్రసంగించారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రైజింగ్ 2047 కేవలం విజన్ డాక్యుమెంట్ కాదు.. తెలంగాణ ప్రజలతో మనకున్న అభివృద్ధి ఒప్పందం. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలంటే బ్యాంకింగ్ రంగం కూడా రూపాంతరం చెందాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా భవిష్యత్ బ్యాంకింగ్ వ్యూహాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని ఆయ‌న చెప్పారు.

బ్యాంకులు నిర్దేశించిన లక్ష్యాలను ఎంతవరకు సాధించాయన్నదే కాకుండా, ఇచ్చిన రుణాలతో ఎంత అభివృద్ధి జరిగింది, ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, ఎన్ని ఉద్యోగాలు సృష్టించబడ్డాయ‌నే అంశాల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్ష‌లు చేసుకోవాల‌న్నారు. వ్యవసాయ ఉత్పాదకత ఎంత పెరిగింది, గ్రామీణ ఆదాయం ఎంత మెరుగుపడింది, ఎంత ప్రైవేట్ పెట్టుబడి సమీకరించబడింది అన్నదే బ్యాంకింగ్ పనితీరుకు నిజమైన కొలమానంగా నిలుస్తుంద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.

తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు గ్రామీణ, వ్యవసాయ రంగం పునాది అని ఉప ముఖ్యమంత్రి అన్నారు. రైతులకు రుణాలు అవసరమయ్యే సమయంలోనే అందించాలని ఆయ‌న చెప్పారు. అర్హత ఉన్న రైతులు రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదన్నారు. రైతు రుణం కోసం బ్యాంకును వెతుక్కుంటూ రావడం కాదు.. బ్యాంకింగ్ వ్యవస్థే రైతుల వద్దకు వెళ్లాలని డిప్యూటీ సీఎం చెప్పారు. డెయిరీ, మత్స్య, ఉద్యాన, పామాయిల్, ఫుడ్ ప్రాసెసింగ్ స‌హా ఇత‌ర అనుబంధ రంగాలను అధికారిక రుణ వ్యవస్థలోకి తీసుకురావాలని అన్నారు. రైతుకు రుణం ఇవ్వడం మాత్రమే కాకుండా, ఆ రుణాన్ని అధిక, స్థిరమైన వ్యవసాయ ఆదాయంగా మార్చడమే లక్ష్యంగా ఉండాలని సూచించారు.

రైతు రుణాన్ని తిరిగి చెల్లించలేకపోతే కేవలం రికవరీ చర్యలకే పరిమితం కాకుండా, రైతు ఆదాయం ఎందుకు తగ్గిందో విశ్లేషించాలని అన్నారు. ఉత్పాదకత, మార్కెట్ సదుపాయాలు, కోత అనంతర వసతులు, వర్కింగ్ క్యాపిటల్ వంటి అంశాలను రుణ వ్యూహంలో భాగం చేయాలని భ‌ట్టి విక్రమార్క‌ సూచించారు. జూన్ 2026 నాటికి బ్యాంకులు వ్యవసాయ రంగానికి ₹52,337 కోట్లు రుణాలుగా అందించడం అభినందనీయమే అయినప్పటికీ, రుణాలు సకాలంలో అందడం ముఖ్యమని ఆయన గుర్తుచేశారు.

తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడంలో సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా (MSME) రంగం కీలకమని అన్నారు. రుణం మంజూరు కావడం కంటే అవసరమైన సమయంలో డబ్బు చేతికి అందడం వ్యాపారులకు ముఖ్యమని చెప్పారు. దరఖాస్తు, మంజూరు, పంపిణీ ప్రక్రియకు స్పష్టమైన, కొలవదగిన కాలపరిమితి ఉండాలని ఆదేశించారు.  క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ (CGTMSE) కింద ఈ త్రైమాసికంలో రూ.4,463 కోట్ల విలువైన 16,265 ప్రతిపాదనలు ఆమోదం పొందడం అభినందనీయమన్నారు. CGTMSE కింద మంజూరు చేసే రుణాలకు పూచీకత్తు నిబంధనల పేరుతో వ్యాపారులను ఇబ్బంది పెట్టవద్దని ఆయన చెప్పారు.

తెలంగాణ రైజింగ్ 2047లోని క్యూర్, ప్యూర్, రేర్ విధానాలకు అనుగుణంగా ప్రాంతాల అవసరాలను బట్టి ప్రత్యేక రుణ వ్యూహాలను రూపొందించాలని భట్టి విక్రమార్క అన్నారు. క్యూర్ లో AI, లైఫ్ సైన్సెస్, ఫార్మా, ఏరోస్పేస్,  స్టార్టప్‌లు, నాలెడ్జ్ రంగాలకు అధునాతన ఫైనాన్సింగ్ అవసరమని ఆయ‌న తెలిపారు. ప్యూర్ ప్రాంతాల్లో తయారీ, లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్, పారిశ్రామిక క్లస్టర్లు, గృహ నిర్మాణం, మౌలిక వసతులకు నిధులు అవసరమన్నారు. రేర్ ప్రాంతాల్లో వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, డెయిరీ, ఫిషరీస్, గ్రామీణ పరిశ్రమలకు సకాలంలో, సరసమైన రుణాలు అందించాలని భ‌ట్టి విక్ర‌మార్క సూచించారు.

రాష్ట్రంలో జనధన్ ఖాతాలు భారీగా ఉన్నప్పటికీ దాదాపు 19.13 లక్షల ఖాతాల్లో జీరో బ్యాలెన్స్ ఉందన్న విషయాన్ని గుర్తు ఆయన గుర్తు చేశారు. కేవలం ఖాతాలు తెరవడమే కాకుండా వారిని పొదుపు, బీమా, రుణాల దిశగా ప్రోత్సహించడమే నిజమైన ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అని ఆయన అభిప్రాయపడ్డారు. గ్రామాల్లో నిష్క్రియాత్మకంగా ఉన్న బిజినెస్ కరస్పాండెంట్లను వెంటనే క్రియాశీలకం చేయాలని లేదా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ప్రతి గ్రామానికి బ్యాంకింగ్ సేవలు అందేలా చూడాలని ఆయన ఆదేశించారు. అదేవిధంగా మహిళా స్వయం సహాయక సంఘాలను కేవలం బ్యాంక్ లింకేజీలకే పరిమితం చేయకుండా మైక్రో ఎంటర్‌ప్రైజెస్‌గా తీర్చిదిద్దేలా 'ఎంటర్‌ప్రైజ్ ఫైనాన్స్' అందించాలని కోరారు. ప్రభుత్వ పథకాల అమలులో బ్యాంకులకు రావాల్సిన రీయింబర్స్‌మెంట్లు సమయానికి అందేలా చూసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇస్తూ, తెలంగాణ ప్రజల సమగ్ర వికాసానికి బ్యాంకింగ్ రంగం ప్రతినిధులు భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.

తెలంగాణ రైజింగ్ 2047 బ్యాంకింగ్ రోడ్‌మ్యాప్’ను రూపొందించాలని రాష్ట్ర స్థాయి బ్యాంక‌ర్ల సమావేశంలో భట్టి విక్రమార్క ప్రతిపాదించారు. వ్యవసాయ, ఉత్పాదకత ఆధారిత రుణాలు, MSMEలు–స్టార్టప్ ఫైనాన్స్, మహిళా పారిశ్రామికవేత్తలు, గ్రామీణ పరిశ్రమలు, యువత ఉపాధి ఆధారిత రుణాలు, గ్రీన్–క్లైమేట్ ఫైనాన్స్, డిజిటల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్, జిల్లాల మధ్య క్రెడిట్ వ్యత్యాసాల నివారణ, దీర్ఘకాలిక మౌలిక వసతుల ఫైనాన్స్, కొత్త పరిశ్రమలు–సాంకేతిక రంగాలకు సంబంధించిన అంశాలకు ఇందులో స్పష్టమైన వార్షిక లక్ష్యాలు ఉండాలని అన్నారు.

ఈ సమావేశంలో పంచాయతీ రాజ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ దానకిషోర్, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, సెర్ప్ సీఈఓ దివ్య, నాబార్డ్ సీజీఎం చిన్మయ్ కుమార్, ఎస్బీఐ సీజీఎం నీలేష్ ద్వివేది, ఎస్ఎల్బీసీ కన్వీనర్ సతీష్ కుమార్, ట్రాన్స్  కో సీఎండీ కృష్ణ భాస్క‌ర్‌, డీఎఫ్ఎస్ డైరెక్ట‌ర్ మాన‌స గంగోత్రి,  ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.