వాట్సాప్ డీపీతో మోసం..
సైబరాబాద్ పోలీసులు ఒక భారీ సైబర్ నేరానికి సంబంధించిన కేసును అత్యంత వేగంగా ఛేదించారు. కేవలం 10 రోజుల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, బాధితుడు కోల్పోయిన కోటి రూపాయల పూర్తి మొత్తాన్ని రికవరీ చేసి అతడికి అందజేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేశ్ బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
ఒక ప్రముఖ చీరల దుకాణం యజమాని పేరు, వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్(డీపీ)ను వినియోగించి సైబర్ నేరగాళ్లు సదరు దుకాణంలో పనిచేసే అకౌంటెంట్‌కు నకిలీ సందేశం పంపారు. నిజంగా యజమానే డబ్బు అడుగుతున్నారని భావించిన అకౌంటెంట్, నేరగాళ్లు సూచించిన ఖాతాలకు ఏకంగా రూ. 1 కోటి బదిలీ చేశారు. తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన దీపక్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయస్థానం నుంచి త్వరితగతిన ఉత్తర్వులు పొంది, కేవలం 10 రోజుల్లోనే బాధితుడికి పూర్తి సొమ్ము వాపసు వచ్చేలా చర్యలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ రమేశ్ ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు. కేవలం వాట్సాప్ డీపీలు, పేర్లను చూసి ఎవరికీ పెద్ద మొత్తంలో నగదు పంపవద్దని హెచ్చరించారు. ఎవరైనా డబ్బు అడిగితే, వారికి నేరుగా ఫోన్ చేసి వివరాలను నిర్ధారించుకోవాలని సూచించారు. వాట్సాప్ లేదా ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే తెలియని ఏపీకే ఫైళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇన్‌స్టాల్ చేయవద్దని కోరారు. ఒకవేళ ఎవరైనా సైబర్ మోసానికి గురైతే, వెంటనే టోల్-ఫ్రీ నంబర్ 1930కి కాల్ చేయాలని లేదా జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని స్పష్టం చేశారు.
