పాకిస్తాన్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. 30 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా కురుస్తున్న భారీ వర్షాలకు విలవిల్లాడుతోంది పాకిస్తాన్. వరదలు ముంచెత్తడంతో ఇప్పటివరకు వేయి మందికి పైగా మృతి చెందారని ప్రకటించింది జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ.గడిచిన 24 గంటల్లో సుమారు 120 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. మరో 1500 మంది గాయపడ్డారు. గత మూడు దశాబ్దాలతో పోలిస్తే ఇది 192 శాతం ఎక్కువని పాకిస్తాన్ వాతావరణశాఖ తెలిపింది. ఈ వరదల ప్రభావం అన్ని వ్యవస్థలపై పడింది.
ప్రముఖ మీడియా అందించిన సమాచారం ప్రకారం, లాహోర్ మార్కెట్ హోల్‌సేల్ ధరలు చుక్కలు చూస్తున్నాయి. రాబోయే కొద్ది రోజుల్లో ఉల్లిపాయలు, టొమాటో ధర కిలో రూ.700 దాటవచ్చని అక్కడి వ్యాపారులు అంచనా వేస్తున్నారు. అదే విధంగా బంగాళదుంప ధర కిలో రూ.40 నుంచి 120కి పెరిగింది. కాగా, పాకిస్తాన్ ప్రభుత్వం భారత్ నుంచి టమోటాలు, ఉల్లిపాయలను దిగుమతి చేసుకోవాలని ప్లాన్ చేస్తోంది. ఈ విషయాన్ని మార్కెట్‌లోని హోల్‌సేల్ వ్యాపారులు వెల్లడించారు. భారత్ నుంచి వాఘా సరిహద్దు ద్వారా ఉల్లి, టమాటా దిగుమతి చేసుకునే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. భారత్ నుంచి ఉల్లి, టమాటా వస్తే కానీ ధరలు దిగివచ్చే అవకాశాలు కనిపించడం లేదు.
భారత్ నుంచి ఉల్లి-టమోటా దిగుమతి చేసుకోనున్న పాక్ ప్రభుత్వం!
ప్రస్తుతం, టమోటాలు,ఉల్లిపాయలు ఆఫ్ఘనిస్తాన్ నుంచి లాహోర్, పంజాబ్‌లోని ఇతర నగరాల్లోని టోర్ఖమ్ సరిహద్దు ద్వారా సరఫరా చేయబడుతున్నాయి. అయితే.. వరదల కారణంగా మార్కెట్‌లో క్యాప్సికం వంటి కూరగాయలకు కూడా కొరత ఏర్పడిందని లాహోర్ మార్కెట్ కమిటీ కార్యదర్శి వెల్లడించాడు. భారత్ నుంచి ఉల్లి, టమాటాలను ప్రభుత్వం దిగుమతి చేసుకోవచ్చని ఆయన అభిప్రాయ పడుతున్నాడు. ఇరాన్ ప్రభుత్వం దిగుమతులు, ఎగుమతులపై పన్నును పెంచినంత సులువుగా ఇరాన్ నుంచి తఫ్తాన్ సరిహద్దు (బలూచిస్థాన్) ద్వారా కూరగాయలను దిగుమతి చేసుకోవడం అంత సులభం కాదని వారు అన్నారు. అయితే భారత్ నుంచి దిగుమతి చేసుకుంటే ధర కూడా కలిసి వస్తుందని వారు అంచనా వేస్తున్నారు.
కూరగాయలతోపాటు పలు వస్తువుల ధరలు ..
పాకిస్తాన్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కూరగాయలతో పాటు పలు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. గత వారంలో 23 నిత్యావసర వస్తువులు, కూరగాయలు, గుడ్లు, పప్పులు, ఇతర వస్తువుల సగటు ధరలు పెరిగాయని పాకిస్తాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (PBC) విడుదల చేసిన డేటా వెల్లడించింది.
పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు
టమోటా – 43.09%
ఉల్లిపాయ – 41.13%
బంగాళదుంప – 6.32%
గుడ్లు – 3.43%
పొడి పాలు – 1.53%
సిగరెట్లు – 2.26%
LPG – 1.95%
కూరగాయల ధరలు ఇలా..
టమాటా – కిలో రూ.500
ఉల్లి – కిలో రూ.400
బంగాళదుంప – కిలో రూ.120