కరోనా వైరస్ కారాణంగా ప్రపంచంలోనే అతి పెద్దదైన చైనాలోని షెంజెన్ ఎలక్ట్రానిక్స్ మార్కెట్ మూతపడింది. ఇది ప్రపంచంలో అతిపెద్ద హోల్ సేల్ మార్కెట్. షెంజెన్ పట్టణంలో కొన్ని రోజులుగా కరోనా వైరస్ కేసులు పెరిగిపోవడంతో చైనా సర్కారు మార్కెట్ ను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. చైనా సర్కారు జీరో కోవిడ్ విధానాన్ని అమలు చేస్తుండడం తెలిసిందే. ఇందులో భాగంగా ఒక్క కేసు వచ్చినా ఆయా ప్రాంతాలను పూర్తిగా కట్టడి చేస్తుంది.
వచ్చే గురువారం వరకు వ్యాపారాలను మూసివేయాలంటూ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో ఈ మార్కెట్ మూతపడింది. అందరూ తమ ఇళ్లల్లోనే ఉండిపోవాలని, రోజువారీగా న్యూక్లియిక్ యాసిడ్ టెస్ట్ చేయించుకోవాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. టెలికం ఎక్విప్ మెంట్ లో దిగ్గజ సంస్థ హువావే, చైనాకు చెందిన సెమీకండక్టర్ మ్యాన్ ఫ్యాక్చరింగ్ ఇంటర్నేషనల్ కార్ప్, యాపిల్ సరఫరాదారు ఫాక్స్ కాన్ టెక్నాలజీ ఇలా ప్రపంచ దిగ్గజ సంస్థలకు షెంజెన్ ప్రధాన కేంద్రంగా ఉంది.