ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆపరేషన్ చేసి...వేలిముద్రలు మార్చేసి కువైట్ కు పంపుతున్నారు

national |  Suryaa Desk  | Published : Thu, Sep 01, 2022, 08:43 PM

విదేశాలకు వెళ్లేందుకు...అక్కడ సంపాధించేందుకు ఎవరైనా ప్రయత్నించవచ్చు అందులో తప్పులేదు. కానీ అక్రమ మార్గంలో మాత్రం ఏమాత్రం శ్రేయస్కరం కాదు.  అక్రమ మార్గంలో కువైట్ కు పంపే ఏర్పాటు చేస్తున్న ఓ ముఠా భాగోతం తాజాగా వెలుగులోకి వచ్చింది. అపరాధ పరిశోధనలో వేలిముద్రలకు ఉన్నంత ప్రాధాన్యం మరి దేనికీ ఉండదు. నేరస్తుల గుర్తింపునకు పోలీసులు మొదట సేకరించేది వేలిముద్రలే.  ఏదైనా కేసుల్లో ఉన్నవారు విదేశాలకు వెళ్లేందుకు వీలుకాదు. ఒకవేళ ఏదైనా తప్పుడు పేర్లతో విదేశాలకు వెళ్లాలన్నా వేలిముద్రలు ఇట్టే పట్టిస్తాయి. అయితే, అక్రమార్కులు ఇప్పుడు వేలిముద్రలు కూడా మార్చేస్తున్న భాగోతం హైదరాబాదులో వెల్లడైంది. 


ఉద్యోగాల పేరిట కువైట్ కు వ్యక్తులను పంపించేందుకు ఓ ముఠా వేలిముద్రల సర్జరీలు నిర్వహిస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. శస్త్రచికిత్సల ద్వారా ఆయా వ్యక్తుల వేలిముద్రలను మార్చివేసి వారిని కువైట్ పంపుతున్నారు. దీనికి సంబంధించి పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారు కనీసం 11 వేలిముద్రల మార్పిడి శస్త్రచికిత్సలు చేయించి ఉంటారని పోలీసులు వెల్లడించారు. ఒక్కో శస్త్రచికిత్సకు రూ.25 వేలు వసూలు చేసేవారని వివరించారు. 


కువైట్ నుంచి బహిష్కరణకు గురైన ఇద్దరు వ్యక్తులు, మళ్లీ కువైట్ వెళ్లేందుకు ఈ వేలిముద్రల సర్జరీని ఆశ్రయించారని, వారిని కూడా అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. ఈ శస్త్రచికిత్సలకు అవసరమైన మెడికల్ కిట్లను, ఇతర సాక్ష్యాధారాలను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. మల్కాజిగిరి, ఘట్కేసర్ పోలీసులు సంయుక్తంగా ఈ జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. గజ్జలకొండుగారి నాగమునేశ్వర్ రెడ్డి, సగబాల వెంకట రమణ (అనస్తీషియా నిపుణుడు), బోవిళ్ల శివశంకర్ రెడ్డి, రేండ్ల రామకృష్ణా రెడ్డి అనే వ్యక్తులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. వీరంతా కడపకు చెందినవారు. హైదరాబాదు వచ్చి ఓ హోటల్ లో మకాం వేశారు.


నాగమునేశ్వర్ రెడ్డి కడపలో ఓ రేడియాలజిస్ట్-ఎక్స్ రే టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. సగబాల వెంకటరమణ తిరుపతి డీబీఆర్ ఆసుపత్రిలో అనస్తీషియా టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. ఇక మిగిలిన ఇద్దరు బోవిళ్ల శివశంకర్ రెడ్డి, రేండ్ల రామకృష్ణారెడ్డి గతంలో కువైట్ లో భవన నిర్మాణ కార్మికులుగా పనిచేశారు. వీరిద్దరికీ వేలిముద్రల శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు ఘట్కేసర్ లో ఏర్పాట్లు జరుగుతుండగా, పోలీసులు గుట్టురట్టు చేశారు. 


ఇదిలావుంటే నాగమునేశ్వర్ రెడ్డి, వెంకటరమణ... తమ వద్దకు వచ్చేవారి వేలి పైభాగంలో ఉన్న చర్మాన్ని తొలగించి, కొంత కండర కణజాలాన్ని తీసివేసి, తొలిగించిన చర్మాన్ని తిరిగి దాన్నే కుట్టేసేవారు. ఒకట్రెండు నెలల్లో ఆ గాయం పూర్తిగా మానిపోయేది. ఆపై ఒక ఏడాది వరకు ఆ వ్యక్తి వేలిముద్రలు స్వల్పంగా మారిపోయేవి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com