ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఝార్ఖండ్‌లో కుప్పకూలిన రెడ్‌బర్డ్ ఎయిర్‌వేస్ విమానం

national |  Suryaa Desk  | Published : Tue, Feb 24, 2026, 07:00 AM

ఝార్ఖండ్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఏడుగురు ప్రయాణికులతో రాంచీ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ అంబులెన్స్ చత్రా జిల్లాలో కుప్పకూలింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న ఏడుగురూ మరణించినట్లు అధికారులు తెలిపారు.  రెడ్‌బర్డ్ ఎయిర్‌వేస్‌కు చెందిన బీచ్‌క్రాఫ్ట్ C90 ఎయిర్ అంబులెన్స్ నిన్న రాత్రి 7:11 గంటలకు రాంచీ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయింది. తీవ్ర గాయాలపాలైన సంజయ్ కుమార్ అనే రోగికి మెరుగైన చికిత్స అందించేందుకు ఢిల్లీకి తరలిస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. టేకాఫ్ అయిన సుమారు 20 నిమిషాల తర్వాత, వాతావరణం అనుకూలంగా లేనందున మార్గాన్ని మళ్లించాలని పైలట్ కోరినట్లు, ఆ తర్వాత విమానంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లు, రోగి, ఒక డాక్టర్, పారామెడిక్, ఇద్దరు సహాయకులు సహా మొత్తం ఏడుగురూ మరణించినట్లు చత్రా డిప్యూటీ కమిషనర్ కీర్తిశ్రీ జి వెల్లడించారు. అయితే, మృతుల సంఖ్యపై భిన్నమైన కథనాలు వెలువడుతున్నాయి. ఈ ఘటనలో ఒకరు మాత్రమే మరణించి, ఆరుగురు ప్రాణాలతో బయటపడ్డారని కొన్ని నివేదికలు పేర్కొంటుండటంతో కాస్త గందరగోళం నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా యంత్రాంగం, సహాయక బృందాలు చత్రా జిల్లాలోని సిమారియా అటవీ ప్రాంతంలోని ప్రమాద స్థలానికి చేరుకున్నాయి. ఈ ఘటనను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్  ధ్రువీకరించింది. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేసేందుకు ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో  బృందాన్ని ఘటనాస్థలికి పంపింది. విచారణ పూర్తయితే ప్రమాదానికి అసలు కారణాలు తెలిసే అవకాశం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa