ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫ్యాటీ లివర్ షుగర్ వ్యాధి ప్రమాదాన్ని ఎలా పెంచుతుంది

Health beauty |  Suryaa Desk  | Published : Mon, Feb 23, 2026, 11:17 PM

ఈ రోజుల్లో ఫ్యాటీ లివర్ సమస్య వేగంగా పెరుగుతుంది. ఇక, ఫ్యాటీ లివర్ డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఇవి రెండూ ఒకే సమయంలో రావడానికి ప్రధాన కారణం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని డాక్టర్ వినయ్ కుమార్ బి ఆర్, కన్సల్టెంట్, హెపటాలజీ(ఫోర్టిస్ హాస్పిటల్, బన్నెర్ఘట్ట రోడ్, బెంగళూరు) తెలిపారు. జీవనశైలిలో మార్పులు, వ్యాయామానికి దూరంగా ఉండటం, తిండి అలవాట్లు కారణంగా యువత కూడా ఫ్యాటీ లివర్‌తో పాటు డయాబెటిస్ బారిన పడుతున్నారు. ఫ్యాటీ లివర్ డయాబెటిస్ ప్రమాదాన్ని ఎలా పెంచుతుంది, లక్షణాలు, పాటించాల్సిన జాగ్రత్తలు గురించి డాక్టర్ నుంచి మనం తెలుసుకుందాం.


ఫ్యాటీ లివర్, డయాబెటిస్ మధ్య లింకేంటి?


మన శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించుకోలేనప్పుడు.. రక్తంలో షుగర్ లెవల్స్ పెరుగుతాయి. అప్పుడు శరీరం ఆ అదనపు చక్కెరను కొవ్వుగా మార్చి కాలేయంలో నిల్వ చేస్తుంది. కాలేయంలో ఈ కొవ్వు పేరుకుపోవడాన్నే ఫ్యాటీ లివర్ సమస్య అంటారు. ఇది పెరిగే కొద్దీ శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇంకా ఎక్కువ అవుతుంది.


కాలేయంలో కొవ్వు పెరిగితే ఇన్సులిన్ పనితీరు తగ్గుతుంది. ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోతే కాలేయంలో కొవ్వు ఇంకా పెరుగుతుంది. ఈ పరిస్థితి చివరకు టైప్ 2 డయాబెటిస్‌కు దారితీస్తుంది. ఇందుకు ప్రధాన కారణం ప్రధాన కారణం ఇన్సులిన్ రెసిస్టెన్స్.


డాక్టర్ వినయ్ కుమార్ బి ఆర్.


ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి?


ఫ్యాటీ లివర్ అనేది భవిష్యత్తులో డయాబెటిస్ రావడానికి ఒక మొదటి హెచ్చరిక లాంటిది. ఫ్యాటీ లివర్ డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచినప్పుడు, కొన్ని లక్షణాలు కనిపించవచ్చు.


వాపు: కాలేయంలో కొవ్వు వల్ల కలిగే దీర్ఘకాలిక వాపు, కాలేయం పనితీరును దెబ్బతీస్తుంది. దీనివల్ల శరీరం గ్లూకోజ్, కొవ్వును నియంత్రించడంలో విఫలమవుతుంది. అంటే సామర్థ్యాన్ని కోల్పోతుంది.


అలసట, బలహీనత: ఎక్కువ శారీరక శ్రమ చేయకపోయినా అలసట, బలహీనత కనిపిస్తుంది. అంటే చిన్న చిన్న పనులకే అలసిపోవడం, నిద్రపోయినా బలహీనత ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.


తరచుగా మూత్రవిసర్జన: రక్తంలో షుగర్ లెవల్స్ పెరగడం వల్ల దాహం ఎక్కువగా వేస్తుంది. అంతేకాకుండా తరచుగా మూత్రవిసర్జన కూడా అనుభవించవచ్చు.


ఇతర లక్షణాలు: ఉన్నట్టుండి బరువు పెరగడం, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం ప్రమాదానికి సంకేతం. పొడి చర్మం, నెమ్మదిగా గాయాలు మానడం, తరచుగా ఇన్ఫెక్షన్లు రావడం కూడా లక్షణాలు.


ఫ్యాటీ లివర్‌కి కారణాలేంటి?


ప్రముఖ హె‌ల్త్‌లైన్ నివేదిక ప్రకారం అనేక వ్యాధులు, ఆరోగ్య సమస్యలు నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి  ప్రమాదాన్ని పెంచుతాయి. వాటిలో కొన్ని కింద గమనించవచ్చు.


PCOS


అధిక కొలెస్ట్రాల్


ఇన్సులిన్ రెసిస్టెన్స్


జీవక్రియ సిండ్రోమ్


టైప్ - 2 డయాబెటిస్


హైపోపిట్యూటరీజం


గ్రోత్ హార్మోన్ లోపం


అబ్స్ట్రక్టివ్ స్లీప్ సిండ్రోమ్


రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ అధిక స్థాయిలో ఉండటం


ఊబకాయం, ముఖ్యం బెల్లీ ఫ్యాట్


ఫ్యాటీ లివర్, ఊబకాయం కుటుంబ చరిత్ర


థైరాయిడ్ పనిచేయకపోవడం లేదా హైపోథైరాయిడిజం


ఇతర ప్రమాదాలు


ఫ్యాటీ లివర్ అనేది భవిష్యత్తులో డయాబెటిస్ రావడానికి అనేది ఓ ముందస్తు సంకేతం. ముఖ్యంగా టైప్ - 2 డయాబెటిస్‌కి కారణమవుతుంది. ఇక, ఈ మెటబాలిక్ సమస్యలు కేవలం షుగర్ వ్యాధితో ఆగకుండా గుండె జబ్బులు, ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయని డాక్టర్ హెచ్చరిస్తున్నారు.


ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?


బరువు నియంత్రణ: ఊబకాయం వివిధ రకాల వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే బరువు నిర్వహణ చాలా ముఖ్యం. బరువును అదుపులో ఉంచకపోతే పరిస్థితులు అదుపు తప్పవచ్చు.


సరైన ఆహారం: చక్కెరలు, అనారోగ్యకరమైన కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండాలి. ప్రాసెస్ చేసిన ఆహారాల్ని నివారించాలి.


వైద్య పరీక్షలు: క్రమం తప్పకుండా మెడికల్ చెకప్స్ చేయించుకోవడం వల్ల వ్యాధి ముదరకుండా కాపాడుకోవచ్చు.


పాటించాల్సిన ఆహార నియమాలు


ఫ్యాటీ లివర్, డయాబెటిస్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవడానికి ప్రత్యేకమైన డైట్ అంటూ ఏం లేదు. అయితే, బరువు తగ్గించుకోవడంతో పాటు ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే కాలేయంపై భారం తగ్గించవచ్చని హెల్త్‌లైన్ నివేదిక చెబుతుంది. ఆ ఆహార మార్పులు ఏంటంటే..


చక్కెరను తగ్గించండి: సోడాలు, స్వీట్లు, కూల్ డ్రింక్స్, ప్యాక్ చేసిన జ్యూస్‌ల్ని నివారించడం చాలా ముఖ్యం. వీటిలో కృత్రిమ చక్కెరలు ఉంటాయి. ఇవి కాలేయంలో కొవ్వును వేగంగా పెంచుతాయి.


శుద్ధి చేసిన పిండి పదార్థాలకు నో చెప్పండి: మైదా, వైట్ రైస్, వైట్ బ్రెడ్ వంటి వాటిని తినడం తగ్గించండి.


తృణధాన్యాలు: జొన్నలు, రాగులు, సజ్జలు లేదా బ్రౌన్ రైస్ వంటి తృణధాన్యాల్ని మీ ఆహారంలో భాగం చేసుకోండి.


ఆరోగ్యకరమైన కొవ్వులు: బాగా వేయించిన ఆహారాలు తీసుకోవడం తగ్గించి బాదం, వాల్‌నట్స్, ఆలివ్ ఆయిల్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్న ఫుడ్స్‌ను తీసుకోండి.


ఫైబర్ తీసుకోండి: పండ్లు (మితంగా), ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటాయి.


వ్యాయామం కూడా ముఖ్యమే


శారీరక శ్రమ అంటే వ్యాయామం వల్ల కూడా శరీరంలోని ఇన్సులిన్ పనితీరు మెరుగుపడుతుంది.


ఏరోబిక్ వ్యాయామాలు: వారానికి కనీసం 150 నిమిషాలు వ్యాయామం చేయాలి. బ్రిస్క్ వాకింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్ వంటి వ్యాయామాలు చేయాలి.


బరువులు ఎత్తడం: వారానికి రెండు సార్లు కండరాలకు పని చెప్పే వ్యాయామాలు చేయడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది.


స్థిరత్వం ముఖ్యం: ఏదో ఒక రోజు భారీగా వ్యాయామం చేసి సరిపెట్టుకోవడం కరెక్ట్ కాదు. ప్రతిరోజూ కనీసం ముప్పై నిమిషాల పాటు కనీసం వాకింగ్ అయినా చేయాలి.


ఒత్తిడి నిర్వహణ: ఫ్యాటీ లివర్, డయాబెటిస్ వంటి జీవనశైలి వ్యాధుల్ని అదుపులో ఉంచుకోవడానికి ఒత్తిడి నిర్వహణ కూడా చాలా ముఖ్యం. యోగా, ధ్యానం, ప్రాణాయామంతో ఒత్తిడిని అదుపులో ఉంచుకోవచ్చు.


చివరగా: ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా లివర్‌ని ఆరోగ్యంగా ఉంచుకోవడమే కాకుండా డయాబెటిస్ బారిన పడకుండా ఉండొచ్చు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa