ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈపీఎఫ్ఓ శుభవార్త.. 31 లక్షల మందికి బెనిఫిట్

business |  Suryaa Desk  | Published : Mon, Feb 23, 2026, 11:09 PM

ప్రైవేట్ రంగంలో ఉద్యోగుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గొప్ప సామాజిక భద్రతా పథకం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్. దీనిని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తోంది. కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇది పని చేస్తుంది. ఇప్పుడు ఈపీఎఫ్ఓ కు సంబంధించి.. లేబర్ మినిస్ట్రీ ఒక కీలక ప్రకటన చేసింది. ఇది ఒక రకంగా శుభవార్త. ఈపీఎఫ్ఓ ఇన్‌ఆపరేటివ్ అకౌంట్లకు సంబంధించి అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లను వారి వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయం తీసుకుంది. క్లెయిమ్ చేయని వారి పీఎఫ్ ఖాతాల్లో పెద్ద మొత్తంలో నిధులు పోగుబడగా.. వీటిని చందాదారుల ఖాతాల్లోకే బదిలీ చేయాలని నిర్ణయించడం విశేషం.


ఈ కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో సుమారు 31 లక్షల మంది వరకు చందాదారులకు ప్రయోజనం దక్కనుంది. అయితే పైలట్ ప్రాజెక్టుగా చేపట్టే తొలి విడతలో సుమారు 7 లక్షల మంది వరకు ఈ ప్రయోజనాలు పొందుతారని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ చెప్పుకొచ్చారు. త్వరలోనే ఇది ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈపీఎఫ్ఓ వీక్లీ రివ్యూ మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మాండవీయ సోమవారం వివరించారు.


 >> ప్రస్తుతానికి 31.86 లక్షల వరకు పీఎఫ్ ఖాతాలు.. నిర్వహణ లేవని (ఇనాపరేటివ్) ఈపీఎఫ్ఓ గుర్తించింది. దీంట్లో సుమారు రూ. 10,903 కోట్ల మేర నిల్వలు ఉన్నట్లు అంచనా వేస్తోంది. వీటిల్లో సుమారు 7.11 లక్షల ఖాతాల్లో రూ. 1000 వరకు మాత్రమే నగదు నిల్వలు ఉన్నట్లు పేర్కొంది. వీటి విలువ మొత్తంగా రూ. 30.52 కోట్లుగా ఉన్నాయి. లేబర్ మినిస్ట్రీ ప్రకారం.. ఈ నిర్వహణలో లేని పీఎఫ్ ఖాతాల్లో 20 ఏళ్లకు పైబడినవి కూడా ఉన్నాయి. దాదాపు మూడేళ్లుగా ఎలాంటి ట్రాన్సాక్షన్ నిర్వహించిన పీఎఫ్ అకౌంట్లను ఇన్ఆపరేటివ్ అకౌంట్లుగా పేర్కొంటారు.


>> ముందుగా ఇప్పుడు పైలట్ ప్రాతిపదికన ముందుగా 7 లక్షల ఖాతాల్లోని అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లను వారి బ్యాంక్ అకౌంట్లలో జమ చేయనుంది ఈపీఎఫ్ఓ. ఇక్కడ ఆధార్‌తో అనుసంధానం అయి ఉన్న బ్యాంక్ అకౌంట్, ఈపీఎఫ్ఓ దగ్గర ఉన్నటువంటి వివరాల ఆధారంగా ఈ నగదు జమ చేయనుంది. ఇక్కడ చందాదారులు.. ఎలాంటి క్లెయిమ్ సెటిల్మెంట్ డాక్యుమెంట్స్ గానీ లేదా ఇతర డాక్యుమెంట్స్ గానీ ఇవ్వాల్సిన అవసరం లేదు. పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం అయితే.. అప్పుడు మిగతా 25 లక్షల మంది వరకు నిర్వహణలో లేని పీఎఫ్ చందాదారుల ఖాతాల్లోకి కూడా డబ్బును ఆటోమేటిక్‌గా రిఫండ్ చేసేందుకు ఈపీఎఫ్ఓ సన్నాహాలు చేస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa