ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జైళ్లను సంస్కరణాలయాలుగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమన్న అనిత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 23, 2026, 08:54 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జైళ్లలో మగ్గుతున్న ఖైదీల జీవితాల్లో వెలుగులు నింపే దిశగా కూటమి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఈరోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల 8వ రోజున రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత 'జైళ్లు, సంస్కరణల చట్టం సవరణ బిల్లు'ను ప్రవేశపెట్టగా, సభ దీనికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి అనిత, జైళ్లను కేవలం శిక్షా కేంద్రాలుగా కాకుండా సంస్కరణాలయాలుగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు క్షమాభిక్ష కల్పించే విషయంలో ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందని, కేంద్రం నిర్దేశించిన చట్టాలకు అనుగుణంగా రాష్ట్రంలోనూ సంస్కరణలు అమలు చేస్తామని ఆమె ప్రకటించారు.జైలు గోడల మధ్య కూడా మానవీయ విలువలు కాపాడాలన్న ఉద్దేశంతో మహిళా ఖైదీల పిల్లల కోసం ప్రత్యేకంగా అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. ఖైదీల నేరచరిత్ర, ప్రవర్తన ఆధారంగా వారిని కేటగిరీలుగా విభజించి, వారిలో మానసిక పరివర్తన తెచ్చేందుకు 'ఓపెన్ ఎయిర్ జైళ్ల'ను అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. ఖైదీలు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత సమాజంలో గౌరవప్రదంగా జీవించేలా వ్యవసాయం మరియు ఇతర వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇస్తామని, వారు చదువుకునేందుకు మరిన్ని అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.ఈ బిల్లుపై జరిగిన చర్చలో పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పాల్గొని పలు కీలక సూచనలు చేశారు. జైళ్లలో సిబ్బంది కొరత, ముఖ్యంగా మహిళా సిబ్బంది లేకపోవడం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను ఆయన సభ దృష్టికి తెచ్చారు. 60 ఏళ్లు దాటిన వృద్ధ ఖైదీలకు, చిన్న చిన్న కేసుల్లో ఇరుక్కున్న వారికి సత్ప్రవర్తన ప్రాతిపదికన క్షమాభిక్ష ప్రసాదించాలని ఆయన కోరారు. గత ప్రభుత్వ హయాంలో తాము కూడా జైలు అనుభవాలను చూశామని గుర్తు చేసుకుంటూ, ఖైదీలు విడుదలయ్యాక జనజీవన స్రవంతిలో కలిసేలా ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ వివరణ అనంతరం బిల్లు ఆమోదం పొందడంతో, త్వరలోనే వందలాది మంది ఖైదీల విముక్తికి మార్గం సుగమం కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa