భారత వైమానిక దళానికి చెందిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ 'క్రాష్' అయిందంటూ వచ్చిన మీడియా నివేదికలను హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఖండించింది. అది ప్రమాదం కాదని, కేవలం ఒక చిన్న సాంకేతిక సమస్య మాత్రమేనని సోమవారం స్పష్టం చేసింది. ఈ మేరకు హెచ్ఏఎల్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.తేజస్ ఘటనపై వచ్చిన మీడియా కథనాలను గమనించాం. ఇందులో వాస్తవాలను స్పష్టం చేయాలనుకుంటున్నాం. తేజస్ విమానం క్రాష్ అయినట్లు ఎటువంటి నివేదిక లేదు. అది కేవలం ఒక చిన్న సాంకేతిక సమస్య మాత్రమే అని హెచ్ఏఎల్ తన ప్రకటనలో పేర్కొంది. సమకాలీన యుద్ధ విమానాల్లో ప్రపంచంలోనే అత్యుత్తమ భద్రతా రికార్డులు తేజస్ సొంతమని బలంగా సమర్థించుకుంది. ఈ సమస్యపై నిబంధనల ప్రకారం లోతైన విశ్లేషణ చేస్తున్నామని, భారత వైమానిక దళంతో కలిసి త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపింది.ఫిబ్రవరి 7న ఒక ఫ్రంట్‌లైన్ ఎయిర్‌బేస్‌లో తేజస్ జెట్ బ్రేక్ ఫెయిల్యూర్ కారణంగా రన్‌వేను దాటిందని, విమానం ఎయిర్‌ఫ్రేమ్‌కు పెద్ద నష్టం వాటిల్లిందని, పైలట్ సురక్షితంగా బయటపడ్డాడని కొన్ని మీడియా నివేదికలు పేర్కొన్నాయి. ఈ నివేదికలను హెచ్ఏఎల్ తప్పుడు సమాచారంగా తోసిపుచ్చింది.ఈ ఘటన తర్వాత, భారత వైమానిక దళం తమ వద్ద ఉన్న సుమారు 30-35 తేజస్ విమానాలన్నింటినీ తనిఖీల కోసం తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఘటనపై భారత వైమానిక దళం 'కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ'కి ఆదేశించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa