ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బంగ్లాదేశ్ సైన్యంలో భారీ మార్పులు.. భారత్‌లో అడ్వైజర్‌కు కీలక పదవి

international |  Suryaa Desk  | Published : Mon, Feb 23, 2026, 07:47 PM

బంగ్లాదేశ్ నూతన ప్రధాన మంత్రిగా బీఎన్పీ అధ్యక్షుడు తారిక్ రెహమాన్ బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే సైన్యంలో కొత్త చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ నియామకం సహా ఉన్నతస్థాయిలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఇవి కీలకమైన వ్యూహాత్మక కమాండ్‌లతో పాటు బంగ్లాదేశ్ ప్రధాన సైనిక నిఘా సంస్థను కూడా ప్రభావితం చేస్తాయని ఢాకా ట్రిబ్యూన్ నివేదిక పేర్కొంది. ఫిబ్రవరి 12న జరిగిన బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో బీఎన్పీ మూడింట రెండొంతుల మెజార్టీ సాధించి అధికారంలోకి వచ్చింది. ఫిబ్రవరి 17న తారిక్ రెహమాన్ ప్రధాన మంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో 18 నెలల మహమ్మద్ యూనస్ నాయకత్వంలోని తాత్కాలిక పాలనకు తెరపడింది. కొత్త ప్రధాని బాధ్యతలు చేపట్టిన రెండు రోజుల్లోనే మార్పులపై ఆర్మీ ప్రధాన కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.


ఆర్మీ ట్రెయినింగ్ అండ్ డొక్టరైన్ కమాండ్ చీఫ్ ఆఫ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ (GOC)గా ఉన్న లెఫ్టినెంట్ జనరల్ ఎం మైనూర్ రెహమాన్‌ను.. చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్‌గా నియమించారు. ఇటీవలే సీజీఎస్ జనరల్ మైజనూర్ రెహమాన్ షమీమ్ పదవీ విరమణ చేయడంతో ఆ పదవి ఖాళీగా ఉంది. అలాగే, ఆర్మీ ప్రధాన కార్యాలయంలో బ్రిగేడియర్ జనరల్‌గా ఉన్న మేజర్ జనరల్ కైజర్ రషీద్ చౌధురికి పదోన్నత లభించింది. ఆయనను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫోరెన్స్ ఇంటెలిజెన్స్ డీజీగా అపాయింట్ చేశారు. ఇప్పటి వరకూ ఈ పదవిలో ఉన్న మేజర్ జనరల్ మహమ్మద్ జహంగీర్ అలమ్.. విదేశీ వ్యవహారాల శాఖకు రాయబారిగా పంపారు.


ప్రిన్సిపల్ స్టాఫ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ జనరల్ ఎస్ఎం కమ్రుల్ హసన్ స్థానంలో ఇటీవల పదోన్నతి పొందిన లెఫ్టినెంట్ జనరల్ మీర్ ముష్ఫికర్ రెహమాన్‌ను నియమించారు. హసన్‌ను విదేశాంగ మంత్రిత్వ శాఖకు అనుబంధంగా విదేశాల్లో రాయబారిగా నియమించారు. అలాగే, భారత్‌లోని బంగ్లాదేశ్ హైకమిషన్‌లో డిఫెన్స్ సలహాదారుగా పనిచేస్తున్న బ్రిగేడియర్ జనరల్ మొహమ్మద్ హఫీజుర్ రెహమాన్‌ను తారిక్ రెహమాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ  ప్రభుత్వం కూడా వెనక్కి పిలిపించింది. ఆయనకు మేజర్ జనరల్ హోదాలో పదోన్నతి కల్పించి 55వ ఇన్‌ఫ్రాంట్రీ డివిజన్‌ జీఓసీగా నియమించారు. ఇప్పటి వరకూ జీవోసీగా ఉన్న మేజర్ జనరల్ జేఎం ఇమ్దాదుల్ ఇస్లాంను ఈస్ట్ బెంగాల్ రెజ్మింటల్ సెంటర్ కమాండట్‌గా పంపారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa