ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"మూడో ప్రపంచ యుద్ధం మొదలైపోయింది": జెలెన్‌స్కీ

international |  Suryaa Desk  | Published : Mon, Feb 23, 2026, 07:51 PM

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం మరో కీలక మలుపు తిరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రతిపాదిస్తున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. కీవ్‌లోని ప్రభుత్వ ప్రధాన కార్యాలయంలో జరిగిన తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. పుతిన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. ప్రపంచం ఇప్పటికే మూడో ప్రపంచ యుద్ధంలోకి అడుగు పెట్టిందని.. దీనిని అడ్డుకోవడానికి పుతిన్‌పై ప్రపంచ దేశాలు సైనిక, ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచాలని పిలుపునిచ్చారు.


శాంతి కోసం భూభాగాలను వదులుకోం!


రష్యా ఆక్రమించిన ప్రాంతాలతో పాటు ప్రస్తుతం ఉక్రెయిన్ ఆధీనంలో ఉన్న డోనెట్స్క్, ఖేర్సన్, జపోరిజ్జియాలోని మరికొన్ని వ్యూహాత్మక ప్రాంతాలను వదులుకోవాలనే పుతిన్ డిమాండ్‌ను జెలెన్‌స్కీ తప్పుబట్టారు. "నేను దీనిని కేవలం భూమిగా చూడటం లేదు.. ఇది ఒక పరిత్యాగం. ఆ ప్రాంతాల నుంచి మా దళాలను ఉపసంహరించుకోవడం అంటే మా రక్షణ వ్యవస్థను బలహీన పరుచుకోవడమే. అక్కడ నివసిస్తున్న లక్షలాది మంది మా పౌరులను శత్రువుల పాలు చేసి.. వారిని వదిలేయడమే అవుతుంది. ఇది మా సమాజాన్ని చీలుస్తుంది" అని జెలెన్‌స్కీ ఆవేదన వ్యక్తం చేశారు.ఇదీ చూడండి: ఉక్రెయిన్ ఉన్నతాధికారుల హత్యకు రష్యా భారీ కుట్ర.. ఒక్కొక్కరి తలపై రూ.90 లక్షల సుపారీ


పుతిన్‌కు కావాల్సింది విరామం మాత్రమే!


ఒకవేళ భూభాగాలను వదులుకుంటే పుతిన్ సంతృప్తి చెందుతారా? అన్న ప్రశ్నకు జెలెన్‌స్కీ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. పుతిన్ ఇప్పుడు కాల్పుల విరమణ కోరుకుంటున్నది కేవలం తన దళాలు తిరిగి పుంజుకోవడానికి మాత్రమేనని జెలెన్‌స్కీ విశ్లేషించారు. ఐరోపా భాగస్వాములు పుతిన్ కోలుకోవడానికి 3 నుంచి 5 ఏళ్లు పడుతుందని భావిస్తున్నప్పటికీ.. ఆయన కేవలం రెండేళ్లలోనే మళ్లీ సిద్ధమవుతారని హెచ్చరించారు. ఆ తర్వాత ఆయన తదుపరి లక్ష్యం ఏ దేశం అవుతుందో ఎవరికీ తెలియదని.. కానీ యుద్ధాన్ని కొనసాగించడమే పుతిన్ నైజమని స్పష్టం చేశారు.


ప్రపంచానికి జెలెన్‌స్కీ హెచ్చరిక..


రష్యా.. ప్రపంచంపై తనదైన జీవనశైలిని రుద్దాలని చూస్తోందని, స్వేచ్ఛాయుత ప్రపంచాన్ని మార్చడమే పుతిన్ లక్ష్యమని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. అందుకే ఆయన్ను వెనక్కి తగ్గించేలా అంతర్జాతీయ సమాజం ఉమ్మడి పోరాటం చేయాలని కోరారు. ఉక్రెయిన్ ఓడిపోవడం లేదని, అంతిమంగా విజయం తమనే వరిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa