విభజన హామీలను కేంద్రానికి తాకట్టుపెట్టిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి గుడివాడ అమర్‌నాథ్ విమర్శించారు. రాష్ట్రానికి అప్పులు ఇవ్వొద్దంటూ రిజర్వు బ్యాంకుకు టీడీపీ నేతలు లేఖలు రాశారని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా మాట్లాడుతున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేశ్‌లను జైలుకు పంపాలని ఆయన అన్నారు. నిన్న విశాఖలో మీడియాతో చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
త్వరలో జరగనున్న మంత్రివర్గ సమావేశంలో మూడు రాజధానులపై చర్చించే అవకాశం ఉందని మంత్రి అన్నారు. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని తామెక్కడా చెప్పలేదని, అయినా 90 శాతానికిపైగా హామీలు అమలు చేశామన్నారు. మిగతా వాటిని కూడా పూర్తి చేస్తామన్నారు. బల్క్ డ్రగ్ ప్రాజెక్టు రాష్ట్రానికి వస్తుంటే వద్దంటూ టీడీపీ నేత యనమల కేంద్రానికి లేఖ రాయడం విడ్డూరంగా ఉందని అన్నారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్న టీడీపీ నేతలు, చంద్రబాబును రాష్ట్రం నుంచి వెళ్లగొట్టాలని మంత్రి అమర్‌నాథ్ అన్నారు.