వైసీపీ పాలనలో రాష్ట్రం విధ్వంసమైందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. పునర్నిర్మాణం కోసం గత ఎన్నికల్లో ప్రజల సహకారం కోరానని తెలిపారు. రాష్ట్రం కోసమే జనసేన, బీజేపీతో కలిసి ఎన్డీయే కూటమిగా ఏర్పడి ప్రజల ఆశీస్సులు అందుకున్నామని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 94 శాతం స్ట్రైక్ రేటుతో అఖండ విజయం కట్టబెట్టారని ఆనందం వ్యక్తం చేశారు. అరకు నుంచి ఉమ్మడి ప్రకాశం వరకు ఒక్క సీటు కూడా వైసీపీకి రాలేదని అన్నారు.'మార్కాపురం జిల్లా కళ, వెలిగొండతో జలకళ, హార్టికల్చర్ రైతుల జీవితాల్లో కళకళ' కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. వేదిక వద్ద ఏర్పాటు చేసిన ర్యాంపుపై కలియతిరుగుతూ ప్రజల హర్షాతిరేకాల మధ్య ఆయన ప్రసంగించారు.వచ్చే ఎన్నికల్లో ప్రకాశం, మార్కాపురం జిల్లా అంతా కూటమిని వంద శాతం గెలిపించాలని కోరారు. 150 కిలోమీటర్లు ప్రయాణించి ఒంగోలుకు వెళ్లాల్సిన ఇబ్బందిని తొలగిస్తూ మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేసి మాట నిలబెట్టుకున్నామని అన్నారు. మార్కాపురం జిల్లా మదనపల్లి జిల్లా, అలాగే పోలవరం జిల్లాను కూడా ఏర్పాటు చేశామని అన్నారు. వెనుకబడిన ప్రాంతాలు నీరు, సౌకర్యాలు లేక ఇబ్బందులు పడ్డారని, మార్కాపురానికి మరో వరంగా వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి నీరు అందిస్తామని హామీ ఇచ్చారు.గతంలో ఈ ప్రాజెక్టుకు తానే శంకుస్థాపన చేశానని, అదే ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఇప్పుడు తనకు అవకాశం వచ్చిందని అన్నారు. 2019-24 మధ్య రాష్ట్రానికి చీకటి రోజులు అని వ్యాఖ్యానించారు. వెలిగొండ ప్రాజెక్టు ఒక్క అడుగు పడలేదని అన్నారు. ఈ ప్రాజెక్టును నిర్మిస్తే 4.35 లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయని, గిద్దలూరు, ఎర్రగొండపాలెం, కనిగరి లాంటి నియోజకవర్గాలతో పాటు ఉదయగిరి, కడప, బద్వేలుకు కూడా నీళ్లు వెళ్తాయని అన్నారు.గతంలో తాను ముఖ్యమంత్రిగా కొనసాగి ఉంటే 2021లోనే ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు ఇచ్చేవాళ్లమని వెల్లడించారు. గత పాలకుడు పనులు పూర్తి అయ్యాయని దొంగ నాటకాలు ఆడారని, పనులు పూర్తి చేయకుండానే జాతికి అంకితం చేశారని విమర్శించారు. నిజంగానే ప్రాజెక్టు పనులు పూర్తి అయి ఉంటే ఇప్పుడు నేను రావాల్సిన అవసరమే ఉండేది కాదని పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తి చేస్తానని నాలుగు సార్లు సభలు పెట్టి నాలుగు తేదీలు ఇచ్చాడని అన్నారు.ఉత్తుత్తి ప్రాజెక్టుకు రిబ్బన్ కట్ చేసి మోసం చేశాడని మాజీ ముఖ్యమంత్రిపై మండిపడ్డారు. రూ.9081 కోట్ల నిధులు ఈ ప్రాజెక్టుకు అవసరమని, ఇప్పటి వరకు నిర్మాణానికి రూ.5451 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. భూసేకరణకు రూ.484 కోట్లు, పునరావాసానికి రూ.184 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. రెండు దశల్లో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని ప్రణాళిక చేశామని, మరో రూ.2,540 కోట్లు ఖర్చు చేస్తే కానీ వెలిగొండ పనులు పూర్తి కావని అన్నారు.గడచిన 20 నెలల్లో రూ.540 కోట్లు ఖర్చు చేసి పనులు వేగంగా చేపడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. రూ.456 కోట్లతో విలువైన ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులకు శంకుస్థాపన చేసి బహిరంగ సభకు వచ్చానని తెలిపారు. గత పాలకులు ఐదేళ్లలో ఈ ప్రాజెక్టుకు రూ.500 కోట్లు ఖర్చు చేసి పనులు అయిపోయాయని పంగ నామాలు పెట్టారని మండిపడ్డారు. ఎవరు మంచి చేస్తే వారికి అండగా నిలిస్తేనే ప్రజల జీవితాలు మెరుగవుతాయని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa