ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీజేపీ ఎంపీలపై కేసు నమోదు

national |  Suryaa Desk  | Published : Sat, Sep 03, 2022, 08:25 PM

బీజేపీకి చెందిన జార్ఖండ్ ఎంపీలు నిషికాంత్ దూబే, మనోజ్ తివారీ సహా ఏడుగురు ఇతరులపై కేసు నమోదైంది. నిబంధనలకు విరుద్ధంగా ఏటీసీ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి చార్టర్డ్ విమానంలో వెళ్లేందుకు అనుమతి తీసుకున్నారని ఎయిర్పోర్ట్ డీఎస్పీ సుమన్ అనన్ ఫిర్యాదు ఆధారంగా బీజేపీ నేతలపై కేసు నమోదైంది. అయితే.. దేవ్ ఘర్ ఎయిర్ పోర్ట్ లో సూర్యాస్తమయానికి అరగంట ముందు నుంచి కార్యకలాపాలకు అనుమతి లేదు.

ఎఫ్ఐఆర్‌లో తెలిపిన వివరాల ప్రకారం, గొడ్డా నియోజకవర్గ ఎంపీ నిశికాంత్ దూబే, ఆయన కుమారులు కనిష్క్ కాంత్, మహీకాంత్, ఎంపీ మనోజ్ తివారీ, ముకేశ్ పాఠక్, దేవతా పాండే, పింటూ తివారీ దేవ్‌గఢ్ విమానాశ్రయంలోని హై సెక్యూరిటీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)లోకి చొరబడ్డారు. తమ చార్టర్డ్ విమానానికి అనుమతి ఇవ్వాలని అధికారులపై ఒత్తిడి చేశారు.

ఈ విమానాశ్రయం నుంచి రాత్రి వేళలో విమానాలు బయల్దేరడానికి అనుమతి లేదు. సూర్యాస్తమయానికి 30 నిమిషాల ముందు మాత్రమే విమానాలు ఇక్కడి నుంచి బయల్దేరవచ్చు. ఈ సంఘటన జరిగిన రోజు సూర్యాస్తమయ సమయం సాయంత్రం 6.03 గంటలు. అయితే వీరి చార్టర్డ్ విమానం సాయంత్రం 6.17 గంటలకు బయల్దేరింది. నిశికాంత్ దూబే మీడియాతో మాట్లాడుతూ, తమ విమానం బయల్దేరడానికి విమానాశ్రయం అధికారులు అభ్యంతరం తెలియజేయలేదన్నారు. విమానాశ్రయం డైరెక్టర్ నుంచి తాము అనుమతి తీసుకున్నామని, దీనిపై పోరాడటానికి తాను సిద్ధమేనని తెలిపారు.

దేవ్‌గఢ్ జిల్లా కలెక్టర్ మంజునాథ్ భజంత్రి ట్విటర్ వేదికగా ఎంపీ దూబేను దుయ్యబట్టారు. దూబే తన విమానానికి నిర్బంధంగా అనుమతి పొందారని, భద్రత సంబంధిత నిబంధనలను ఉల్లంఘించారని, ఇది జాతీయ భద్రతను ఉల్లంఘించడమేనని తెలిపారు. మీరు, మీ పిల్లలు, మద్దతుదారులు ఏటీసీ రూమ్‌లోకి ప్రవేశించడానికి ఎవరు అధికారం ఇచ్చారని నిలదీశారు. 


దీనిపై దూబే స్పందిస్తూ, విమానయాన నిబంధనలను మళ్లీ చదువుకోవాలని కోరారు. ఓ ఐఏఎస్ ఆఫీసర్ నుంచి ఈ దేశం మంచిని ఆశిస్తోందన్నారు. ప్రస్తుతం  ఈ విషయం దర్యాప్తులో ఉందన్నారు. విమానయాన, విమానాశ్రయ నిబంధనలను క్షుణ్ణంగా చదువుకున్న తర్వాతే వ్యాఖ్యలు చేయాలని సలహా ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com