ఆన్ లైన్ మార్కెటింగ్ లో కొనే వస్తువుల భద్రతపై తాజాగా సందేహాలు మొదలవుతున్నాయి. దీనికి కారణం పార్శిల్ వస్తువుల రవాణ తీరే కారణంగా తెలుస్తోంది. ఇటీవలి కాలంలో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఈ కామర్స్ వెబ్ సైట్లలో సామగ్రి బుక్ చేసుకోవడం చాలా పెరిగిపోయింది. తక్కువ ధరలకు, డిస్కౌంట్లతో ఇస్తుండటం, జస్ట్ అలా యాప్ లో బుక్ చేస్తే చాలు.. నేరుగా ఇంటి వద్దకే డెలివరీ ఇస్తుండటమే దీనికి కారణం. భారీ స్థాయిలో ఆర్డర్లు వస్తుండటంతో ఈ కామర్స్ సంస్థలు ప్రత్యేకంగా డెలివరీ సర్వీసులను కూడా ప్రారంభించుకున్నాయి. అయితే ఆర్డర్ల డెలివరీకి సంబంధించి తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఓ రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న గూడ్స్ రైలు బోగీ నుంచి వందల కొద్దీ ఈ కామర్స్ పార్సిళ్లను కొందరు ఇష్టం వచ్చినట్టుగా విసిరేస్తుండటం ఈ వీడియోలో కనిపిస్తోంది. ఒకరైతే మరీ ఇష్టారాజ్యంగా విసిరేయడంతో స్టేషన్ ప్లాట్ ఫాంపై ఉన్న ఫ్యాన్ కు పార్సిళ్లు తగిలి కిందపడ్డాయి. నిజానికి ఈ పార్సిళ్లు ఇలా పడేయడానికి రైల్వేకు సంబంధం లేదని.. డెలివరీ సంస్థ వాళ్లే ఇలా చేస్తున్నారని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ఇందుకేనా నాకు వచ్చిన సామగ్రి పగిలిపోయి వచ్చింది అని మరికొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. టీవీలు, ల్యాప్ టాప్ లు, ఫ్రిడ్జ్ లు కూడా ఇలా విసిరేస్తే ఎలా అని మరికొందరు అంటున్నారు. ‘ఎవరు ఎలా విసిరేస్తే ఏంటి. మనకు వచ్చిన ఐటమ్ బాగో లేకుంటే రిటర్న్ ఇచ్చేస్తాం కదా..’ అని మరికొందరు పేర్కొంటున్నారు. ఓ ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను ట్వీట్ చేయగా.. ఏకంగా 31 లక్షల మందికిపైగా వీక్షించారు. 42వేలకుపైగా లైకులు, వేల కొద్దీ రీట్వీట్ లు నమోదయ్యాయి.