ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ ను బీహార్ సీఎం నితీశ్ కుమార్ పరామర్శించారు. బీహార్ ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా సత్తా చాటిన రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అవినీతి కేసుల్లో ఇరుక్కుని సుదీర్ఘ కాలం పాటు జైలు జీవితాన్ని గడిపారు. ఈ క్రమంలో ఆరోగ్యం పూర్తిగా క్షీణించి లేవలేని స్థితిలో కూడా ఆయన కనిపించారు. జైలు నుంచి ఆసుపత్రికి, తిరిగి ఆసుపత్రి నుంచి జైలుకు... ఇలా లాలూ చాలా ఇబ్బందికర పరిస్థితులనే ఎదుర్కొన్నారు.
తాజాగా జైలు శిక్ష పూర్తయి బయటకు వచ్చిన లాలూ...చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ తన బీహార్ పర్యటనలో భాగంగా లాలూను కలిసిన సంగతి తెలిసిందే. నాడు కూడా ఉత్సాహంగా కనిపించిన లాలూ... తాజాగా సోమవారం బీహార్ సీఎం నితీశ్ కుమార్ తనను పరామర్శించేందుకు రాగా... లాలూ ఉత్సాహంగా కనిపించారు.
లాలూను నితీశ్ పరామర్శిస్తున్న దృశ్యాలతో కూడిన వీడియోను విడుదల చేసిన ఆర్జేడీ...దానికి ఓ ఉత్తేజం కలిగించే పాటను జోడించింది. ఈ వీడియోలో నితీశ్‌కు స్వాగతం చెప్పిన లాలూ... ఆ తర్వాత నితీశ్‌ను ఆయన కారు దాకా వచ్చి సాగనంపారు. ఈ సందర్భంగా ఎవరి సహాయం లేకుండానే లాలూ నడిచిన తీరు ఆర్జేడీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.