వంతెన ‘తప్పు డిజైన్’ కారణంగానే ప్రముఖ వ్యాపారవేత్త సైరస్ మిస్త్రీ పయనిస్తున్న కారు ప్రమాదం జరిగిందని విచారణ కమిటీ తేల్చింది. రోడ్డు ప్రమాదంలో ప్రముఖ వ్యాపారవేత్త సైరస్ మిస్త్రీ దుర్మరణం పాలైన ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న ఫోరెన్సిక్ బృందం కీలక వివరాలు వెల్లడించింది. వంతెన ‘తప్పు డిజైన్’ కారణంగానే ప్రమాదం జరిగిందని తేల్చింది. వెనుక సీటులో ఉన్నవారు సీటు బెల్టులు ధరించకపోవటంతో మరణాలు సంభవించాయని పేర్కొంది. ప్రమాదం జరిగినప్పుడు మెర్సిడెస్ - బెంజ్ ఎస్ యూవీ వాహనం భద్రాతా ప్రమాణాలు తమ పని తాము సరిగానే చేశాయని ఏడుగురు సభ్యులు గల ఈ బృందం వెల్లడించింది. ఎయిర్‌బ్యాగ్‌లు ఓపెన్ అయ్యాయని తెలిపింది. ప్రమాదం జరిగిన ప్రదేశానికి మీటర్ల దూరంలోనే రహదారి 3 లేన్ల నుంచి రెండు లేన్లకు కుంచుకుపోవడం గమనార్హం.
ఇదిలా ఉండగా.. మహారాష్ట్ర పోలీస్, రాష్ట్ర రవాణా శాఖ సంయుక్తంగా నియమించబడిన నిపుణుల బృందం మాత్రం అతి వేగమే ప్రమాదానికి కారణమని చెప్పింది. ప్రమాద సమయంలో వాహనం కచ్చితమైన వేగాన్ని నిర్ణయించేందుకు సాఫ్ట్‌వేర్ సిమ్యులేషన్స్, ఇతర సాంకేతిక విధానాలను వినియోగిస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ఫోరెన్సిక్ బృందం నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది.
సేవ్ లైఫ్ ఫౌండేషన్ నియమించిన ఈ ఫోరెన్సిక్ టీమ్ సభ్యులందరూ విషయ నిపుణులే. వీరంతా క్రాష్ పరిశోధనలలో అనుభవజ్ఞులైన నిపుణులు. ఇద్దరు ఐఐటీ ఖరగ్‌పూర్ నుంచి పీహెచ్‌డీ చేసిన వారు ఉండగా.. మరో ఇద్దరు మెకానికల్, సివిల్ ఇంజనీర్లు ఉన్నారు. మరొక సభ్యుడు సిమ్యులేషన్స్, మోడలింగ్‌లో నైపుణ్యం కలిగినవారు.