టీచర్ అడిగిన ప్రశ్నకు చేయ్యి పైకి ఎత్తి మరీ సమాధానం ఇస్తూ ఒక్కసారిగా ఓ విద్యార్థి కుప్పకూలి మరణించింది. ఉపాధ్యాయుడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ గుడ్లు తేలేసి తరగతి గదిలోని కుప్పకూలి మృతి చెందింది ఓ బాలిక. నెల్లూరు జిల్లా వింజమూరు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం (సెప్టెంబర్ 7) ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా విషాదం నింపింది. పాప మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. బాలిక మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. స్కూల్ సిబ్బంది, విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. షాహిదా అనే విద్యార్థిని వింజమూరు ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. బయాలజీ టీచర్ వేంకటేశ్వర్లు తరగతి గదిలోకి రాగానే.. ‘కిరణజన్య సంయోగ క్రియ పాఠానికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతామన్నారు కదా సార్’ అని విద్యార్థులు గుర్తు చేశారు. ఉపాధ్యాయుడు వేంకటేశ్వర్లు ఈ పాఠాన్ని నిన్న బోధించారు.
ఉపాధ్యాయుడు కిరణజన్య సంయోగ క్రియ గురించి చెప్పమని అడగ్గా.. ఇద్దరు ముగ్గురు విద్యార్థులు పైకి లేచి వివరించారు. ఈ క్రమంలో తాను కూడా చెబుతానంటూ విద్యార్థిని షాహిదా చేయి పైకెత్తింది. టీచర్ వేంకటేశ్వర్లు చెప్పమన్నారు. అమ్మాయి పైకి లేచి రెండు, మూడు మాటలు మాట్లాడి.. అకస్మాత్తుగా కనుగుడ్లు తేలేసి, పక్కకు అలా ఒరిగిపోయి కుప్పకూలింది. ఆ హఠాత్పరిమాణానికి టీచర్, విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు.
ఉపాధ్యాయుడు వేంకటేశ్వర్లు వెంటనే అప్రమత్తమై షాహిదాను పైకి లేపి మొహం కడిగించారు. ఫిట్స్ వచ్చాయేమోననే అనుమాతంతో తాళంచెవిని తీసి చేతిలో పెట్టారు. విద్యార్థుల ద్వారా కబురుపెట్టి అక్కడికి లేడీ టీచర్‌ను రప్పించారు. పాఠశాలకు చెందిన మరో ఉపాధ్యాయుడి కారులో వెంటనే ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. షాహిదాను పరిశీలించిన వైద్యుడు అప్పటికే ఆమె ప్రాణాలు విడిచినట్లు తెలిపారు. ఘటన జరిగిన 5 నిమిషాల లోపే విద్యార్థిని ఆస్పత్రికి తరలించామని ఉపాధ్యాయుడు తెలిపారు. పాప మరణవార్త విని ఆమె తల్లిదండ్రులు బోరున విలపించారు. అప్పటిదాకా తమతో ఉన్న షాహిదా.. ఇకలేదని తెలిసి తోటి విద్యార్థులు కూడా కంటతడి పెట్టుకున్నారు. ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.