బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా మైనార్టీలు ముఖ్యంగా హిందువులకు రక్షణ కరవయ్యింది. హిందువులపై దాడులు, అఘాయిత్యాలు అకృత్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా, మరో ఘోరం వెలుగుచూసింది. ఓ హిందూ మహిళను ముగ్గురు దుండగులు అపహరించి, సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. ఈ దారుణ ఘటన బరిషాల్ జిల్లాలోని చందాపుర్ తాలూకాలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. దివ్యాంగురాలైన ఆమె రాత్రి 9 గంటల సమయంలో ఓ చోట భజనకు వెళ్లి తిరిగొస్తుండగా.. ముగ్గురు నిందితులు బలవంతంగా ఎత్తుకెళ్లారు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.
సోమవారం ఉదయం రోడ్డుపక్కన స్పృహకోల్పోయి ఉన్న ఆమెను గుర్తించిన స్థానికులు.. చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. తనను రకీబ్, సోహైల్, రస్సెల్ అనే ముగ్గురు అపహరించి, సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు వెల్లడించింది. తనను చిత్రహింసలకు గురిచేసి గాయపరిచినట్లు ఆమె తెలిపింది. అయితే, ఇప్పటి వరకు ఈ ఘటనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను అరెస్టు చేయాలని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ హిందూ సంఘాలు, మానవ హక్కుల కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
ప్రస్తుతం బాధితురాలు భోలా సదర్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఆమెకు తీవ్ర గాయాలైనట్టు వైద్యులు తెలిపారు. బాధితురాలిని చందాపూర్ తాలూకా షయేష్ఠాకండి గ్రామానికి చెందిన వివాహితగా గుర్తించారు. వరుస ఘటనలతో స్థానిక హిందువులు ఆందోళనకు గురవుతున్నారు. షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత నుంచి బంగ్లాదేశ్లో మైనార్టీలే లక్ష్యంగా దాడులు కొనసాగుతున్నాయి. హిందువుల ఆస్తులను ధ్వంసం చేస్తూ.. హత్యలు, అత్యాచారాలకు పాల్పడుతున్నారు. జనవరిలోనూ ఓ హిందూ మహిళపై దుండుగులు అత్యాచారానికి పాల్పడ్డారు. భూవివాధంలో వితంతుపై ఇద్దరు అత్యాచారం చేసి, ఆమెను చెట్టుకు కట్టి జుట్టు కత్తిరించి దారుణంగా అవమానించారు. ఇప్పటికే పలువురు హిందువులను దారుణంగా హత్య చేసిన ఘటనలు, సజీవదహనం చేసిన ఘటనలపై భారత్ తీవ్రంగా స్పందించింది. మైనార్టీల భద్రత విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని బంగ్లాదేశ్ ప్రభుత్వానికి న్యూఢిల్లీ పలు సందర్భాల్లో సూచించింది. అయినా కానీ, దాడులు మాత్రం ఆగడం లేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa