రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడు ఇంధన యుద్ధంగా మారి ఐరోపా దేశాల మధ్య చిచ్చు పెడుతోంది. రష్యా దాడులతో ఇప్పటికే అంధకారంలో మగ్గుతున్న ఉక్రెయిన్‌కు పొరుగు దేశమైన స్లొవేకియా ఊహించని షాక్ ఇచ్చింది. ఉక్రెయిన్‌కు తాము అందిస్తున్న అత్యవసర విద్యుత్ సరఫరాను తక్షణమే నిలిపివేస్తున్నట్లు తాజాగా స్లొవేకియా ప్రభుత్వం ప్రకటించింది. రష్యా చమురు సరఫరా విషయంలో తలెత్తిన వివాదమే ఈ కఠిన నిర్ణయానికి కారణం కాగా.. ఉక్రెయిన్ పరిస్థితి అంధకారంగా మారుతోంది.
అసలీ వివాదం ఏమిటంటే..?
రష్యా నుంచి మధ్య ఐరోపా దేశాలకు ముడి చమురును సరఫరా చేసే అతిపెద్ద మార్గం ‘డ్రుజ్బా పైప్‌లైన్’. ఇది ఉక్రెయిన్ భూభాగం మీదుగా స్లొవేకియా, హంగేరీ దేశాలకు వెళ్తుంది. అయితే జనవరి 27వ తేదీ నుంచి నుంచి ఈ పైప్‌లైన్ ద్వారా చమురు సరఫరా నిలిచిపోయింది. రష్యా జరిపిన డ్రోన్ దాడుల వల్ల పైప్‌లైన్ దెబ్బతిందని, అందుకే సరఫరా ఆగిందని కీవ్ అధికారులు చెబుతున్నారు. ఉక్రెయిన్ కావాలనే అబద్ధాలు చెబుతోందని.. పైప్‌లైన్ బాగానే ఉన్నా రాజకీయ కారణాలతోనే చమురును నిలిపి వేసిందని స్లొవేకియా ఆరోపిస్తోంది. పరిస్థితిని సమీక్షించేందుకు తమ రాయబారిని కూడా ఉక్రెయిన్ అనుమతించడం లేదని మండిపడుతోంది.
స్లొవేకియా ప్రధాని రాబర్ట్ ఫికో ఈ విషయంలో అత్యంత కఠినంగా స్పందించారు. రష్యా చమురు సరఫరాను ఉక్రెయిన్ పునరుద్ధరించే వరకు తాము కూడా విద్యుత్ సరఫరాను పునఃప్రారంభించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. "ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఈ విషయంలో చర్చలకు నిరాకరిస్తున్నారు. అందుకే మేము ప్రతీకార చర్యలకు దిగాము" అని ఫికో వెల్లడించారు. అంతేకాకుండా చమురు సరఫరా ప్రారంభం కాకపోతే ఐరోపా సమాఖ్యలో సభ్యత్వం కోసం ఉక్రెయిన్ చేస్తున్న ప్రయత్నాలకు తాము మద్దతు ఉపసంహరించుకుంటామని ఘాటుగా హెచ్చరించారు.
ఉక్రెయిన్ విజ్ఞప్తి..
తాజా పరిణామాలపై ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి స్పందిస్తూ.. స్లొవేకియా, హంగేరీ దేశాలు సంయమనం పాటించాలని కోరారు. యుద్ధ సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అత్యవసర విద్యుత్ సరఫరాను నిలిపివేయడం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడతారని విజ్ఞప్తి చేశారు. అయితే రష్యాకు అనుకూలంగా ఉండే స్లొవేకియా, హంగేరీ దేశాలు మాత్రం కీవ్‌పై ఒత్తిడి పెంచేందుకే మొగ్గు చూపుతున్నాయి. ఈ పరిణామం వల్ల ఉక్రెయిన్‌లో విద్యుత్ కోతలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే రష్యా మిస్సైల్ దాడులతో ఉక్రెయిన్ గ్రిడ్లు కుప్పకూలగా.. ఇప్పుడు స్లొవేకియా తీసుకున్న నిర్ణయంతో పూర్తి అంధకారంలో మనుగబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa