తాను విధించిన సుంకాలను రద్దుచేస్తూ అమెరికా సుప్రీంకోర్టు గతవారం ఇచ్చిన తీర్పును అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎగతాళి చేశారు. ఇదో ‘హాస్యాస్పదమైన’ ‘మూర్ఖపు’ తీర్పు అంటూ ట్రంప్ విమర్శలు చేశారు. అధ్యక్షుడు తన అధికార పరిధిని దాటారని చెప్పిన తీర్పు వాస్తవానికి తన అధికారాలను పెంచుకునేలా చేసిందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్‌లో ట్రంప్ పోస్ట్ పెట్టారు. ‘‘విదేశాలకు ముఖ్యంగా దశాబ్దాలుగా మనల్ని నాశనం చేస్తున్న దేశాలపై 'భయంకరమైన' పన్నులు వసూలుకు లైసెన్స్‌లను ఉపయోగిస్తాం ’’ అని పేర్కొన్నారు. అంతేకాదు, వాణిజ్య ఒప్పందంపై వెనక్కి తగ్గే దేశాలు మరింత మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన బెదిరింపులకు దిగారు. తమతో ఒప్పందం కొనసాగించాల్సిందేనని, లేకుంటా సుంకాలను మరింత ఎక్కువ విధించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కీలక దశలో ఉన్న విషయం తెలిసిందే. ఈ ఒప్పందంపై మార్చిలో సంతకాలు చేయాల్సి ఉండగా.. సుప్రీంకోర్టు టారీఫ్‌లను రద్దు చేయడంతో ఫిబ్రవరి 23న ఇరు దేశాల ప్రతినిధుల మధ్య జరగాల్సిన సమావేశం వాయిదా పడింది.
అయితే,సుప్రీంకోర్టు తీర్పు తనకు అసాధారణ అధికారాలు ఎలా ఇచ్చిందనేది మాత్రం ఆయన స్పష్టమైన వివరణ ఇవ్వలేదు. పూర్తిగా గౌరవం లేకపోవడంతో చిన్న అక్షరాలను (సుప్రీం కోర్టును సూచించడానికి) ఉపయోగిస్తానని’ ట్రంప్ ప్రకటించారు. ‘‘అమెరికా సుప్రీంకోర్టు హాస్యాస్పదమైన, మూర్ఖత్వమైన, అంతర్జాతీయంగా విభేదాలకు దారి తీసిన తీర్పు ద్వారా నాకు మునుపెన్నడూ లేనంత ఎక్కువ అధికారాలు, శక్తిని ఇచ్చింది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు జారీ చేసే లైసెన్సులను.. వస్తువులు, సేవల దిగుమతులపై నేరుగా సుంకాలు, విదేశీ వాణిజ్యంపై జరిమానాలు విధించే మార్గంగా ఉపయోగించడానికి అవకాశం కల్పిస్తాయని ట్రంప్ పేర్కొన్నారు. అలాగే, 1971లో అమలులోకి వచ్చిన IEEPA వంటి చట్టాలను ఉపయోగించి, అమెరికాతో వాణిజ్యం చేయాలనుకునే దేశాలు ప్రత్యేక అనుమతులు అంటే లైసెన్సులు కోరాల్సిన పరిస్థితి ఉంటుందని ఆయన తేల్చిచెప్పారు. ఇందుకు సమాధానం ఏంటో తనకు తెలుసనని, దీనిపై వివరణ ఇవ్వాల్సిన పనిలేదని ట్రంప్ అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు తనకు మరిన్ని అధికారులను ఉపయోగించుకునే అవకాశం కల్పించిందని అన్నారు.
అంతేకాదు ‘కోర్టు మరిన్ని సుంకాలను కూడా ఆమోదించింది. మొదట ఉపయోగించిన విధానంతో పోలిస్తే, ఇప్పుడు వాటిని మరింత శక్తివంతంగా, మరింత కఠినంగా, అలాగే చట్టపరమైన స్పష్టతతో అమలు చేయవచ్చు’’ అని అధ్యక్షుడు ట్రంప్ వివరించారు.
అలాగే, జన్మతః పౌరసత్వ హక్కుపై కూడా ట్రంప్ ప్రస్తావించారు. అమెరికా భూభాగం జన్మించిన విదేశీయుల పిల్లలకు అమెరికా పౌరసత్వం ఇవ్వడాన్ని ట్రంప్ తరుచూ వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు తర్వాత ఏం చెబుతుందో తెలుసా.. చైనా, ఇతర దేశాలకు అనుకూలంగా తీర్పులు ఇవ్వొచ్చు అని, జన్మతః పౌరసత్వ హక్కుతో విదేశీయులు ప్రయోజనాలు పొందుతున్నారని దుయ్యబట్టారు.
ఇక, ట్రంప్ సుంకాలను మొత్తం 9 మంది న్యాయమూర్తుల్లో ఆరుగురు వ్యతిరేకించగా.. ముగ్గురు సమర్దించారు. తీర్పు రాసిన ప్రధాన న్యాయమూర్తి.. ట్రంప్ తన అధికార పరిధిని దాటారని, సుంకాలను విధించే అధికారం కేవలం కాంగ్రెస్‌కు మాత్రమే ఉంటుందని తేల్చిచెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa