తిరుపతి రూరల్ ఎంపీడీఓ కార్యాలయంను రూ. 50 లక్షలతో ఆధునీకరించారు. సరికొత్త హంగులతో తీర్చిదిద్దిన కార్యాలయాన్ని సోమవారం ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. కార్యాలయాన్ని అద్భుతంగా ఆధునీకరించారని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఎంపీపీ అభినందించారు.గతేడాది తిరుపతి రూరల్ ఎంపీపీగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అయితే బీటలు వారిన గోడలు వర్షాలకు ఉరుస్తున్న పైకప్పులతో అస్తవ్యస్తంగా ఉన్న కార్యాలయంను ఆధునీకరించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కార్యాలయ సిబ్బంది సైతం బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజే ఈ సమస్యను ఎంపీపీ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో అన్ని గదులను ఆధునీకరించిన తర్వాతే తన ఛాంబర్ కు వస్తానని ఎంపీపీ చెప్పారు. పట్టుదలతో రూ. 50 లక్షలను మంజూరు చేయించి, కార్యాలయంను ఆధునీకరించి, దానిని ప్రారంభించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనం, సర్పంచ్లు, ఎంపీటీసీలు వెంటరాగా తన ఛాంబర్లో ఎంపీపీ కూర్చీలో కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటనారాయణ, ఏఓ పిచ్చిరెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.