తిరుమల క్షేత్రంలో బజరంగ్ భజగోవిందం , సమానత్వమే ధ్యేయం- పర్యావరణ పరిరక్షణే లక్ష్యం అనే యాత్రా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు బజరంగ్ ఫౌండేషన్ సీఈవో అంబటి మురళీకృష్ణ తెలిపారు. తిరుమలలో సోమవారం ఆయన శ్రీవారి నడక దారిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బజరంగ్ భజగోవిందం కార్యక్రమంలో భాగంగా ఫౌండేషన్ సభ్యులు,సిబ్బంది తిరుపతి నుంచి తిరుమలకు కాలినడకన చేరుకున్నారు.
కాలి నడక మార్గంలో ప్లాస్టిక్ వ్యర్థాలను శుభ్రం చేస్తూ 2027 లోపు సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేయాలన్న ముఖ్యమంత్రి జగన్ మోహన రెడ్డి ఆశయాలను యాత్రికులకు వివరిస్తూ కార్యక్రమం ముందుకు సాగింది. అనంతరం తిరుమల నడకదారిలో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ నిషేధాన్ని ప్రచారం చేస్తూ స్టీల్ వాటర్ బాటిల్స్ యాత్రికులకు ఉచితంగా పంపిణీ చేశారు. స్టీల్ బాటిల్స్ పంపిణీకి ప్రజల నుండి అనూహ్య స్పందన లభించింది. సీఈవో అంబటి మురళీ, ఫౌండేషన్ సభ్యులతో కలిసి ప్లాస్టిక్ శుభ్రం చేస్తూ వారిలో ఉత్సాహాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో నడక దారిలోని భక్తులు సైతం పాల్గొనడం గమనార్హం. నేడు అంబటి మురళీ కృష్ణ శ్రీవారిని సర్వ దర్శనం లో దర్శించుకోనున్నట్లు ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు