జనంలోకి వెళ్లేందుకు జనసేనాని పవన్ కల్యాణ్ చేపట్టబోయే బస్సు యాత్ర మరికొన్నిరోజుల్లో ప్రారంభం కానుంది. ఈ యాత్రలో పవన్ కల్యాణ్ వినియోగించే బస్సును ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ బస్సు పనులు చకచకా సాగుతున్నాయి. సెప్టెంబరు 26 నాటికి బస్సు పనులు పూర్తవుతాయని తెలుస్తోంది. దూరంగా ఉన్నవారికి సైతం పవన్ కనిపించేలా ఈ బస్సు టాప్ ను తీర్చిదిద్దుతున్నారు. సౌండ్ సిస్టమ్ ను సైతం ఈ బస్సుకే అటాచ్ చేయనున్నారు. ఇప్పటివరకు వివిధ నేతలు రాజకీయ యాత్రలకు ఉపయోగించిన బస్సులతో పోల్చితే ఇది భిన్నంగా కనిపిస్తుంది. అయితే, నాడు ఎన్టీఆర్ వినియోగించిన చైతన్యరథానికి ఇది దగ్గరగా ఉంది. పవన్ బస్సుకు రెగ్యులర్ సైజు టైర్లు అమర్చారు. ఓ వర్క్ షాపులో ఈ బస్సు పనులు జరుగుతున్నాయి. ఇక లోపలి భాగంలోనూ పవన్ బస చేసేందుకు అనేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ఏపీలో జనసేనను క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు పవన్ కల్యాణ్ బస్సు యాత్ర మార్గాన్ని ఎంచుకున్న సంగతి తెలిసిందే.