ఏపీకి చెందిన కరాటే క్రీడాకారుడు కార్తీక్ రెడ్డికి వైసీపీ ప్రభుత్వం రూ.10 లక్షల నగదు ప్రోత్సాహకం అందించింది. ఇదిలావుంటే ఇటీవలే ముగిసిన కామన్వెల్త్ గేమ్స్లో ఏపీకి చెందిన కరాటే క్రీడాకారుడు కార్తీక్ రెడ్డి సత్తా చాటాడు. అండర్ 16, 70 కిలోల కుమిటే విభాగంలో అతడు స్వర్ణ పతకం గెలిచాడు. అదే విధంగా గతంలో లాస్ వెగాస్ వేదికగా జరిగిన యూఎస్ఏ చాంపియన్ షిప్ లోనూ స్వర్ణ పతకంతో రాణించాడు. ఈ యువ క్రీడాకారుడిని గురువారం రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా చిన్న వయసులోనే కరాటేలో సత్తా చాటుతున్న కార్తీక్ రెడ్డిని జగన్ అభినందించారు. తన భవిష్యత్తు లక్ష్యాలపై ఆరా తీసిన జగన్... కార్తీక్ రెడ్డికి రూ.10 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా కరాటేను శాప్ క్రీడల జాబితాలో చేర్చాలని జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.