చిత్తూరులో గురువారం రాత్రి భారీ సంఖ్యలో ప్రైవేటు విద్యాసంస్థల బస్సులను సీజ్ చేయడం కలకలం రేపింది సీఎం సభకు వాహనాలను ఇవ్వలేదని కక్ష సాధింపులో భాగంగా వివిధ కారణాలు చూపుతూ వీటిని రవాణా శాఖ కార్యాలయానికి తరలించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా అప్పుడప్పుడు ఒకటి, రెండు రోజులు స్కూలు బస్సులు సామర్థ్యం, విద్యార్థుల సంఖ్య, బస్సు స్థితి , పన్నులు చెల్లింపులు ఇతర వాటిని పరిశీలిస్తారు. ఇప్పుడు ఏకంగా ప్రైవేటు స్కూల్లో బస్సులను టార్గెట్ చేస్తూ తనిఖీలు చేయడం వివాదాస్పదంగా మారింది. 60కి పైగా బస్సులను సీజ్ చేసి డిటిసి కార్యాలయానికి తరలించారు. శుక్రవారం పాఠశాలలు కళాశాలలకు విద్యార్థులను తరలించడానికి ఇబ్బందిగా ఉంటుందని కొన్ని ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు సీఎం సభకు బస్సులను పంపడానికి నిరాకరించారు. అందుకని సీజ్ చేసి వేధిస్తున్నారని విమర్శలు ఉన్నాయి.