దేశీయ స్టాక్ మార్కెట్లలో నష్టాల పర్వం కొనసాగుతోంది. ఈరోజు కూడా మార్కెట్లు భారీగా నష్టపోయాయి. అమ్మకాల ఒత్తిడితో మార్కెట్లు వరుసగా ఆరో సెషన్ లో కూడా నష్టాలను మూటకట్టుకున్నాయి. ఆర్థికమాంద్యం వచ్చే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో... మానిటరీ పాలసీని మరింత కఠినతరం చేస్తామని అమెరికా ఫెడరల్ రిజర్వ్ చేసిన ప్రకటన మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపింది.
ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 509 పాయింట్లు నష్టపోయి 56,598కి పడిపోయింది. నిఫ్టీ 148 పాయింట్లు కోల్పోయి 16,858కి దిగజారింది. హెల్త్ కేర్, ఐటీ, టెక్, ఆటో సూచీలు మినహా అన్ని సూచీలు నష్టాల్లో ముగిశాయి. మరోపక్క, ఆసియా-పసిఫిక్ మార్కెట్లన్నీ ఈరోజు నష్టపోయాయి. యూరోపియన్ మార్కెట్లు కూడా నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఏసియన్ పెయింట్స్ (2.90%), సన్ ఫార్మా (2.21%), డాక్టర్ రెడ్డీస్ (2.03%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.42%), నెస్లే ఇండియా (1.23%).
టాప్ లూజర్స్:
ఐటీసీ (-2.97%), యాక్సిస్ బ్యాంక్ (-2.84%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-2.64%), టాటా స్టీల్ (-2.41%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.07%).