అక్టోబర్ 25న సచివాలయాల్లో ఈ–క్రాపింగ్ జాబితాలను ప్రదర్శించాలని సీఎం జగన్ వైసీపీ నాయకులకి సూచించారు. ఉపాధి హామీ పథకం కింద కనీస వేతనం రూ.240 అందేలా చూడాలని ఆదేశించారు. డిసెంబర్ 21 నాటికి 5 లక్షల ఇళ్లు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని, జగనన్న కాలనీల్లో 3.5 లక్షలు, 1.5 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తిచేయాలన్నారు. కొత్తగా అర్హులైన లబ్ధిదారులకు ఫేస్–3 కింద డిసెంబర్లో ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి స్పందన కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో పనుల మంజూరు, వ్యవసాయం, ఈ– క్రాపింగ్, ఉపాధి హామీ పనులు, వైయస్ఆర్ విలేజ్, అర్బన్ క్లినిక్స్, గృహనిర్మాణం, ఇళ్ల పట్టాలు, జగనన్న భూ హక్కు – భూ రక్ష సర్వే, స్పందన అర్జీలు, జాతీయ రహదారులకు భూ సేకరణ అంశాలపై సీఎం వైయస్ జగన్ సమీక్షించారు. 26 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులకు పలు అంశాలపై సీఎం వైయస్ జగన్ దిశానిర్దేశం చేశారు.